Begin typing your search above and press return to search.

బాలయ్యకు భారీ షాక్ ఇవ్వబోతున్న స్వామి !

అలాంటి హిందూపురంలో బాలయ్యకు ఈసారి ఎదురులేదు అన్న వాతావరణం ఉంది.

By:  Tupaki Desk   |   22 April 2024 5:50 PM GMT
బాలయ్యకు భారీ షాక్ ఇవ్వబోతున్న స్వామి !
X

హిందూపురంలో టీడీపీకి ఎదురు లేదు. దానికి మరో పేరు నందమూరిపురం. ఎన్టీయార్ మూడు సార్లు బాలయ్య రెండుసార్లు, హరిక్రిష్ణ ఒకసారి గెలిచిన సీటు అది. ఒక కుటుంబం నుంచి ఆరు సార్లు గెలిచిన సీటుగా ప్రత్యేకత ఉంది. అలాంటి హిందూపురంలో బాలయ్యకు ఈసారి ఎదురులేదు అన్న వాతావరణం ఉంది.

దానికి కారణం వైసీపీలో ఉన్న వర్గ పోరు. వైసీపీ ప్రతీ ఎన్నికకూ అభ్యర్ధిని మారుస్తోంది. దాంతో టికెట్ రాని వారు అసంతృప్తికి లోను అవుతున్నారు. నవీన్ నిశ్చల్ 2014లో బాలయ్య మీద పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయనకు 2019లో టికెట్ ఇవ్వలేదు. 2024లోనూ ఇవ్వలేదు.

ఇక 2019లో టికెట్ అందుకున్న మహమ్మద్ ఇక్బాల్ కి 2024లో టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అబ్దుల్ ఘనీ కి కూడా టికెట్ మీద ఆశ ఉంది. కానీ వైసీపీ హై కమాండ్ దీపిక అనే కొత్త ఫేస్ ని బాలయ్య మీదకు పోటీ పెడుతోంది.

ఒక విధంగా వైసీపీలో వర్గ పోరు ఉంది. కో ఆర్డినేషన్ మిస్ అయింది. అదే బాలయ్యకు వరంగా మారుతోంది. న్యాయంగా చెప్పాలీ అంటే బాలయ్య మీద కూడా వ్యతిరేకత ఉంది. ఆయన అందుబాటులో ఉండకుండా తన ప్రతినిధిని పెట్టి కధ నడిపిస్తున్నారు అని జనాలు గుర్రు మీద ఉన్నారు. ఈసారి వైసీపీ ఐక్యంగా ఉండి సరైన క్యాండిడేట్ ని పెడితే ఓటమి అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.

కానీ బాలయ్య లక్ బాగుంది కాబట్టి వైసీపీలో వర్గ పోరు అలా కొనసాగుతోంది. దీంతో ఇక హ్యాట్రిక్ విజయం తధ్యమని బాలయ్య భావిస్తున్నారు. అయితే ఉరమని ఉరుములా శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి రంగంలోకి దిగుతున్నారు. ఆయన బీజేపీ నాయకుడు.

ఆయన హిందూపురం ఎంపీ టికెట్ ని ఆశించారు. అయితే బీజేపీ జాతీయ పెద్దల వద్ద పలుకుబడి ఉన్న స్వామికి ఏపీ బీజేపీ నేతలు మాత్రం షాక్ ఇచ్చేశారు. అసలు హిందూపురం టికెట్ నే తీసుకోలేదు. రాజంపేట, తిరుపతి కోరుకున్నారు. నిజంగా చెబితే తిరుపతి కంటే హిందూపురంలోనే బీజేపీకి చాన్స్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు.

స్వామి అక్కడ రెండేళ్ళుగా మకాం వేసి మరీ బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకుని వచ్చారు. అయితే ఆయనకు టికెట్ దక్కకుండా చేసిన వారిలో టీడీపీ బీజేపీ పెద్దల హస్తం ఉందని అంటున్నారు. దాంతోనే మండిపోయిన స్వామి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురం ఎంపీగా పోటీలో ఉంటాను అని ప్రకటించారు.

ఇపుడు నామినేషన్ల పర్వం సాగుతోంది. దాంతో స్వామి నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు. అయితే హిందూపురం ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని చెబుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆయనను పిలిపించి మాట్లాడారని పోటీ వద్దు అని నచ్చచెప్పారని ప్రచారం సాగుతోంది. అయితే స్వామి మాత్రం తాను రెడీ అని బాబుకే షాక్ ఇచ్చి వచ్చేశారుట. ఆయన హిందూపురం అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు.

స్వామికి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలకు భక్తులు ఉన్నారు. దాంతో ఆయన పోటీ చేస్తే కచ్చితంగా ఓట్ల చీలిక భారీగా ఉంటుందని టీడీపీ భయపడుతోంది. ఆయన పోటీ వల్ల గెలుపు దక్కకపోయినా టీడీపీ ఓటు బ్యాంక్ కి చిల్లు పెడతారు అని అంటున్నారు. అదే జరిగితే బాలయ్య హ్యాట్రిక్ కలలకు గట్టి దెబ్బ పడుతుందని అంటున్నారు. మొత్తానికి సేఫ్ జోన్ లో ఇప్పటిదాకా ఉన్న బాలయ్యకు టెన్షన్ పెట్టేలాగే స్వామి ఉన్నారని అంటున్నారు.