రాజ్యసభ ఎన్నికలు : అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు.. సేమ్ టు సేమ్!!
ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జూన్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, ఆశావహుల ప్రయత్నాలతో ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై హాట్ డిబేట్ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 5 March 2026 11:00 PM ISTఏపీలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జూన్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, ఆశావహుల ప్రయత్నాలతో ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై హాట్ డిబేట్ జరుగుతోంది. మొత్తం నాలుగు ఖాళీలు ఏర్పడనుండగా, అన్ని స్థానాలు అధికార కూటమి దక్కించుకోనుంది. అయితే ఈ నాలుగు స్థానాల్లో కూటమిలోని మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగుగా మారింది. అంతేకాకుండా నాలుగు సీట్లలో ఒకటి పారిశ్రామిక వేత్త, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీకి కేటాయించనున్నారనే ప్రచారం ఆశావహుల్లో గుబులు రేకెత్తిస్తోంది. అదే సమయంలో పరిమళ్ నత్వానిని ఏ పార్టీ కోటా కింద చూపుతారనే అంశం కూడా మూడు పార్టీల నేతలను భయపెడుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి రెండు సార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆ రెండు ఎన్నికలు కూడా సభ్యులు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలే. వచ్చే జూన్ లో ఆరేళ్ల పదవీకాలానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. మే నెలతో నలుగురు వైసీపీ సభ్యులకు పదవీ కాలం ముగియనుంది. ఇందులో పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి అత్యంత సన్నిహితుడైన పరిమళ్ నత్వాని ఎంపిక ఆరేళ్ల కిందట రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వైసీపీకి ఎటువంటి సంబంధం లేకపోయినా, కేంద్రంలో అధికార బీజేపీ సూచనలతో వైసీపీ అప్పట్లో పరిమళ్ నత్వానిని తన పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సివచ్చిందని చెప్పేవారు.
అయితే, పరిమళ్ నత్వాని ఎంపికపై అప్పట్లో విపక్షం విమర్శలు గుప్పించింది. కానీ, అప్పటి పాలకపక్షమైన వైసీపీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. పరిమళ్ నత్వాని వంటి వారు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తే, పారిశ్రామిక వృద్ధికి ఉపయోగపడుతుందని ప్రచారం చేసింది. అయితే బీజేపీ ప్రోద్బలంతోనే అప్పట్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ, వైసీపీకి మధ్య ఎలాంటి రాజకీయ బంధం లేకపోయినా, కేవలం రాజకీయ అవగాహనతోనే ఒక స్థానాన్ని వైసీపీ అప్పట్లో వదులుకోవాల్సివచ్చిందని అంటున్నారు.
అయితే ఇప్పుడు కూడా పరిమళ్ నత్వాని తనకు రెన్యువల్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. బీజేపీ పెద్దలు కూడా ఈ విషయమై ఆయనకు భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఈ విషయమై చర్చ జరిగిందని అంటున్నారు. పరిమళ్ నత్వానీకి రెన్యువల్ చేయకతప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ విషయమై కూటమి నేతల్లో పెద్ద చర్చ జరుగుతోంది. నాలుగు స్థానాల్లో టీడీపీ రెండు, బీజేపీ, జనసేన చెరో స్థానాన్ని ఆశిస్తున్నాయి.
గతంలో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే రెండు టీడీపీ, రెండు బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభలో ఇప్పటివరకు జనసేనకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ సారి తమ పార్టీకి ఒక స్థానం ఇవ్వాలని మిగిలిన మూడింట్లో మీరు సర్దుబాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరినట్లు చెబుతున్నారు. దీనికి సీఎం కూడా అంగీకరించారని చెబుతున్నారు. అయితే బీజేపీ కోరుతున్న ఒక స్థానాన్ని పరిమళ్ నత్వానితో భర్తీ చేస్తామని సీఎం చెబుతుండగా, బీజేపీ అందుకు నిరాకరిస్తున్నదనే సమాచారమే పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది.
బీజేపీ తన కోటా కింద ఒక స్థానం తీసుకుని, టీడీపీ కోటాలో ఒక స్థానం పరిమళ్ నత్వానికి ఎలా సిఫార్సు చేస్తుందని టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతున్నారు. పరిమళ్ నత్వానికి రెన్యువల్ చేయకతప్పదని సీఎం చెప్పడంతో ఆయనపైనే భారం వేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ఎక్కువ అవుతోంది. పరిమళ్ నత్వానిని టీడీపీ కోటాలో రాజ్యసభకు పంపుతారా? లేక బీజేపీ కోటాలోనే నత్వానిని ఎంపిక చేస్తారా? అన్నది చూడాల్సివుంది. ఏదిఏమైనా నత్వాని అభ్యర్థిత్వం కూటమి పార్టీల్లో హాట్ డిబేట్ గా మారింది.
