Begin typing your search above and press return to search.

‘పాలమ్మి.. పూలమ్మి కాదు ‘అమ్మ’ ఆస్తి కొట్టేసి పైకొచ్చాడు’!

మల్లారెడ్డి పాలమ్మో.. పూలమ్మో పైకి రాలేదని.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల్ని కొట్టేసి ఇంతటి వాడయ్యాడంటూ సంచలనానికి తెర తీశారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:36 AM GMT
‘పాలమ్మి.. పూలమ్మి కాదు ‘అమ్మ’ ఆస్తి కొట్టేసి పైకొచ్చాడు’!
X

'పాలమ్మా.. పూలమ్మా.. కష్టపడి పని చేశా. పైకి వచ్చా' అన్న మాట చదివినంతనే మంత్రి మల్లారెడ్డి గుర్తుకు వస్తారు. తాను పైకి ఎలా వచ్చింది? వందల కోట్లు ఎలా సంపాదించింది.. ఆయన కథలు కథలుగా చెప్పటం తెలిసిందే. తన కాలేజీల్లో చదివే వేలాది మంది విద్యార్థుల నడుమ.. మల్లారెడ్డి నోటి నుంచి వచ్చే ఈ మాటలకు.. సభికులు రియాక్టు అయ్యేదెంత? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే.. మంత్రి మల్లారెడ్డి నోటి నుంచి అదే పనిగా వచ్చే ఈ మాటలకు.. షాకింగ్ కౌంటర్ తాజాగా ఎదురైంది. ఊహంచటానికి కూడా ధైర్యం చేయని రీతిలో ఉన్న ఈ వ్యాఖ్యలు.. మంత్రి మల్లారెడ్డి ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ మంత్రి మల్లారెడ్డిపై ఎవరు? ఏ తరహాలో విమర్శలు చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.

మల్లారెడ్డి పాలమ్మో.. పూలమ్మో పైకి రాలేదని.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల్ని కొట్టేసి ఇంతటి వాడయ్యాడంటూ సంచలనానికి తెర తీశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పలువురు గులాబీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని..అందులో ఆమె డెయిరీ ఫాం ఏర్పాటు చేశారన్నారు.

'ఆ సమయంలో పాల వ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడకు వెళ్లేవాడు. ఒకసారి ఐటీ దాడులు జరగనున్నట్లుగా జయలలితకు సమాచారం రావటంతో తన దగ్గర ఉన్న డబ్బు.. నగల్ని ఒక చోట దాచిపెట్టి ఉంచారు. దాన్ని మల్లారెడ్డి కొట్టేశాడు. అంతేకాదు.. మల్లారెడ్డి తన ఇంటి పక్కనుండే క్రిస్టియన్ విద్యా సంస్థల యజమానురాలికి మాయ మాటలు చెప్పి.. సంతకాలు పెట్టించుకొని.. ఆమె చనిపోయిన తర్వాత వాటిని తన సొంతం చేసుకున్నారు’ అంటూ సంచలనానికి తెర తీశారు. మరి.. ఈ షాకింగ్ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.