తెలుగువారిని దారుణంగా చంపిన పాకిస్థానీ.. దుబాయ్ లో ఏమి జరిగింది?
విదేశాల్లో వివిధ కారణాలతో మృత్యువాతపడుతున్న భారతీయుల జాబితాలో తాజాగా మరో ఇద్దరు తెలుగువారు చేరిన విషాద ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 15 April 2025 12:26 PM ISTవిదేశాల్లో విద్యనభ్యసిస్తూ, ఉద్యోగాలు చేస్తుకుంటూ ఉన్న భారతీయులు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అగ్రరాజ్యంలో ఇటీవల ఎక్కువ ఘటనలు జరిగినట్లు కథనాలు రాగా.. తాజాగా దుబాయ్ లో ఓ ఘోరం జరిగిపోయింది! అక్కడ ఇద్దరు తెలుగువారిని ఓ పాకిస్థానీ కౄరంగా హత్య చేశారు!
అవును... విదేశాల్లో వివిధ కారణాలతో మృత్యువాతపడుతున్న భారతీయుల జాబితాలో తాజాగా మరో ఇద్దరు తెలుగువారు చేరిన విషాద ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... దుబాయ్ లో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి ఘోరంగా హత్య చేశాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత శుక్రవారం ఇద్దరు తెలుగువారిని పాకిస్థాన్ పౌరుడు అతి కిరాతకంగా నరికి చంపాడు. నిర్మల్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు దుబాయ్ లోని ఓ ఫేమస్ బేకరీలో పనిచేస్తున్నారు. అదే బేకరీలో పాకిస్థాన్ కు చెందిన పౌరుడు పని చేస్తున్నాడు. ఈ సమయంలో అతడు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు.
ఆ పని ఒత్తిడితోపాటు మత విద్వేషంతోనే వీరిద్దరినీ అతడు కత్తితో దారుణంగా నరికి చంపాడని తెలుస్తోంది. ఈ దాడిలో మృతులతో పాటు మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు సమాచారం. ఈ దాడి అనంతరం సదరు పాకిస్థానీ.. మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే... ఇంత దారుణ ఘటన జరిగినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా బేకరీ యాజమాన్యం జాగ్రత్త పడుతోందని అంటున్నారు.
కాగా... తెలంగాణ నుంచి వలస వెళ్లిన కార్మికులు.. ముఖ్యంగా కువైట్, సౌదీ అరేబియా, దుబాయ్, ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాన్ రెసిడెంట్ ఇండియా సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో.. వలస కార్మికుల సంక్షేమ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించలని ప్రభుత్వం యోచిస్తోంది.