Begin typing your search above and press return to search.

'వార్' ఉద్రిక్తత.. టాప్ 4 లేటెస్ట్ ఆప్డేట్స్

అందులో అతి ముఖ్యమైన 4 అప్డేట్స్ ను చూస్తే.. తాజా పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఒక స్పష్టత వస్తుందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   5 May 2025 5:37 PM IST
వార్ ఉద్రిక్తత.. టాప్ 4 లేటెస్ట్ ఆప్డేట్స్
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. భారత్ స్పందించిన తీరు తెలిసిందే. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాక్ పీచ మణచటంలో మోడీ సర్కారు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిగో యుద్దం.. అదిగో యుద్ధం అంటూ వార్ జోన్ ఉద్రిక్త వాతావరణం రెండు దేశాల్లోనూ నెలకొంది. ఇలాంటి వేళ.. అంతర్జాతీయంగా.. జాతీయ పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో అతి ముఖ్యమైన 4 అప్డేట్స్ ను చూస్తే.. తాజా పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఒక స్పష్టత వస్తుందని చెప్పాలి.

పహల్గాంలో ఉగ్రదాడి చోటు చేసుకొని పదకొండు రోజులు అవుతోంది. భారత్ ను కవ్విస్తూ పాక్ దళాలు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నాయి. పాక్ దాడులకు భారత్ బలంగా బుద్ధి చెబుతోంది. అయినప్పటికి పాక్ మాత్రం కుక్క తోక వంకర బుద్ధిని పోగొట్టుకోలేకపోతోంది. మరోవైపు భారత్ తో పూర్తి యుద్ధం మొదలైతే తమ పరిస్థితి ఏమిటన్న దానిపై పాక్ ప్రభుత్వం.. ప్రజలు కిందా మీదా పడుతున్న పరిస్థితి.

1. పాక్ నీళ్లకు చెక్ చెప్పి.. 2 డ్యామ్ లలో నిల్వ సామర్థ్యం పెంపు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టిన భారత్.. పాక్ కు వెళ్లే చీనాబ్ నది నీళ్లను నిలిపి వేస్తామని ప్రకటించటమేకాదు.. చేతల్లోచూపించిన వైనం తెలిసిందే. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న రెండు డ్యాములల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బాగ్ లిహార్ డ్యామ్ నీటిని ఆపేయగా.. తాజాగా సలాల్ డ్యామ్ ను కూడా మూసేసింది. అంతేకాదు.. ఈ రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులక రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలైనట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడు పాక్ కు మొత్తం నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేయటం సాధ్యం కాకున్నా.. భవిష్యత్తులో మాత్రం పాక్ కు సమస్యలు ఎదురుకాక తప్పదంటున్నారు. సింధు జలాల ఒప్పందం కింద వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్ కు నీటి కరవు ఖాయం. పాక్ దూకుడుకు దిమ్మ తిరిగిపోయేలా దెబ్బ తీయటమే కాదు.. దీర్ఘకాలిక ప్రాతిపదికన దానికి తగిన బుద్ధి చెప్పే దిశగా మోడీ సర్కారు వ్యూహరచన చేస్తున్నట్లుగా చెప్పాలి.

2. ప్రధాని మోడీతో రక్షణ శాఖ కార్యదర్శి మీటింగ్

ఉగ్రదాడులతో తరచూ ఇబ్బంది పెడుతున్న దాయాది పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు వీలుగా.. మోడీ సర్కారు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు మొదలు కావటమే కాదు.. యుద్ధమే సంభవిస్తే మన దెబ్బ దాయాది దేశానికి బలంగా తగిలే వ్యూహరచన చేస్తున్నారు. దీనికి సంబంధించి వరుస భేటీల్ని నిర్వహిస్తున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. ఇటీవల త్రివిద దళాల అధిపతులతో భేటీ అయిన ప్రధాని మోడీ.. వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రక్షణ శాఖ కార్యదర్శితో సమావేశం కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాక్ ఉగ్రదాడికి బదులుగా భారత్ ఇప్పటివరకు సైనికంగా ఇప్పటివరకు బదులు ఇవ్వలేదు. కానీ.. పాక్ ను అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేయటం కనిపిస్తుంది.

3. జైళ్లపై దాడులకు దాయాది కొత్త కుట్ర?

పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పరిణామాలు వేగంగా మారటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారత్ ను మరింత ఇబ్బంది పెట్టేందుకు వీలుగా పాకిస్తాన్ మరో దుర్మార్గమైన ప్లాన్ కు తెర తీసినట్లుగా అనుమానిస్తున్నారు. జమ్ముకశ్మీర్ లో హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు వీలుగా భారీ కుట్రకు పాల్పడిన వైనాన్ని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ క్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్.. కోట్ బాల్వాల్ జైలు.. జమ్ములోని జైళ్లకు భద్రతను భారీగా పెంచేశారు.

పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్.. ఓవర్ గ్రౌండ్ వర్కర్లను అదుపులోకి తీసుకొని ఈ జైళ్లల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో వీరిని విడిపించేందుకు వీలుగా పాక్ మద్దతుతో ఉగ్రవాదులు జైళ్లపై దాడికి ప్లాన్ చేసిన వైనాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో భద్రతా దళాల్ని అలెర్టు చేస్తున్నారు.

4. బలాన్ని చూపేలా పాక్ క్షిపణి ప్రయోగం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు.. భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యంగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. భారత్ తో యుద్దమంటే పాక్ దళాలు భయపడుతూ.. బెదిరిపోతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ చెప్పటంతో పాటు.. తమకు తగిన బలం ఉందన్న బిల్డప్ ఇచ్చేలా పాక్ చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా తాజాగా ఒక క్షిపణి పరీక్షల్ని పాక్ నిర్వహించింది. తొలిసారి 450కి.మీ. రేంజ్ క్షిపణిని ప్రయోగించిన దాయాది.. మరో క్షిపణి పరీక్షల్ని నిర్వహించింది. ఇదంతా తాము భారత్ కు తీసిపోమన్న భావన కలిగే ప్రయత్నం చేస్తోంది.అయితే.. యుద్ధం మొదలైతే వారం వ్యవధిలోనే పాక్ వద్ద ఉన్న మందుగుండు అయిపోతుందన్న వార్తలు వస్తున్నాయి.