పాక్ ఆటలు కట్టించేస్తోంది... భారత్ 'సుదర్శన్ చక్ర' గురించి తెలుసా?
పహల్గాం ఉగ్రదాడికి భారత్ అపరేషన్ సిందూర్ తో ప్రతీకారం మొదలుపెట్టింది. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాలపై 24 క్షిపణులతో విరుచుకుపడింది.
By: Tupaki Desk | 9 May 2025 5:34 AMపహల్గాం ఉగ్రదాడికి భారత్ అపరేషన్ సిందూర్ తో ప్రతీకారం మొదలుపెట్టింది. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాలపై 24 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మరణించారని భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఈ సమయంలో పాక్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ సమయంలో సుదర్శన చక్ర.. పాక్ ఆటలు కట్టించేస్తోంది.
అవును... ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా పాకిస్థాన్ వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడులకు దిగుతుంది. ఇందులో భాగంగా... గురువారం ఉదయం భారత్ లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ లను ప్రయోగించింది. రాత్రి జమ్మూ లక్ష్యంగా మరిన్ని డ్రోన్లు, మిస్సైళ్లు, ఫైటర్ జెట్ లను వదిలింది.
అయితే.. వాటన్నింటినీ భారత్ మరో ఆలోచన లేకుండా అడ్డుకోగలిగింది. అందుకు భారత సైన్యానికి పూర్తిగా సహకరించిన రక్షణ వ్యవస్థలో ఎస్-400 సుదర్శన్ చక్రంది కీలక పాత్ర! ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్థాన్ లోని గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనం చేయగలిగిందంటే వారి వద్ద ఇలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడమే!
ఈ ఎస్-400 ను రష్యాకు చెందిన ఎన్.పీ.వో. అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని సంచార్ క్షిపణి వ్యవస్థ అని కూడా అంటారు. 2018లో మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్, రష్యాతో 543 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ కు చేరగా.. మిగిలిన రెండు వచ్చే ఏడాది ఆగస్టులో చేరే అవకాశం ఉందని అంటున్నారు.
డ్రోన్లు, యుద్ధవిమానాలు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో ఇది నేలకూల్చగలదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ పాక్ భారత్ పై సుమారు 50 డ్రోన్లు, 8 మిస్సైళ్లు, 3 ఫైటర్ జెట్ లను ప్రయోగించగా.. వాటన్నింటినీ సమర్ధవంతంగా నాశనం చేయడంలో ఈ ఎస్-400 పాత్ర అత్యంత కీలకం.
ఈ స్థాయి వ్యవస్థ భారత్ కు రావడంలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాత్ర కీలకం అని చెబుతారు. నాడు ఈ వ్యవస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ కు అవసరమని ప్రధాని మోడీకి పారికర్ నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రష్యాతో ఒప్పందం చేసి రప్పించారు.