Begin typing your search above and press return to search.

పాక్ కు కాళరాత్రి... ఉగ్రవాదులను వణికించిన భారత్ అస్త్రాలివే!

ఈ సమయంలో భారత్ అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి, ఉగ్రమూకలపై ఎక్కుపెట్టినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 May 2025 2:54 PM IST
పాక్ కు కాళరాత్రి... ఉగ్రవాదులను వణికించిన భారత్ అస్త్రాలివే!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతికారంతో రగిలిపోతున్న భారత్.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఈ దాడులతో పాకిస్థాన్ లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏమిటో చూపించింది. ఈ సమయంలో భారత్ అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి, ఉగ్రమూకలపై ఎక్కుపెట్టినట్లు తెలుస్తోంది.

అవును.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రమూకలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కేవలం 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రస్థావరాలపై భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో విరుచుకుపడ్డాయి. ఈ సమయంలో భారత్.. ఆత్మాహుతి డ్రోన్లు, హ్యూమర్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులను వాడినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించారు!

ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ లో భారత్ వాడిన అత్యాధునిక ఆయుధాల్లో "స్కాల్ప్ క్షిపణులు" ఒకటని చెబుతున్నారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి. తాజా దాడిలో భారత్.. ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్స్ యుద్ధ విమానాల నుంచి దీనిని ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.

అదేవిధంగా... ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. భారత అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని, లక్ష్యాలను గుర్తించి, అనంతరం వాటిపై విరుచుకుపడతాయి. వీటిని కదులుతున్న లక్ష్యాలను ఛేదించేందుకు వాడతారు!

ఇదే సమయంలో... భారత్ సైన్యం పాక్ ఉగ్రవాదులు ఉన్న భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యూమర్ బాంబులను వినియోగించినట్లు చెబుతున్నారు! వీటిని లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించవచ్చు! ఇవి స్మార్ట్ బాంబ్ కోవలోకి వస్తాయని చెబుతున్నారు. జైషే మహ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయంపై వీటిని ప్రయోగించినట్లు తెలుస్తోంది!

ఈ సమయంలో ప్రధానంగా అతిపెద్ద ఉగ్ర స్థావరాలుగా చెప్పే బవహల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యతను వాయుసేన స్వీకరించగా.. మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుందని చెబుతున్నారు. ఈ సమయంలో... తమ నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో నౌకాదళం సహకారం అందించిందని సమాచారం!