Begin typing your search above and press return to search.

ఒకే దేశం - ఒకే ఎన్నికపై కేంద్రం మరో సంచలన నిర్ణయం!

దేశంలో జమిలి ఎన్నికల కోసం కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది

By:  Tupaki Desk   |   1 Sep 2023 6:35 AM GMT
ఒకే దేశం - ఒకే ఎన్నికపై కేంద్రం మరో సంచలన నిర్ణయం!
X

దేశంలో జమిలి ఎన్నికల కోసం కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంటుతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సెప్టెంబర్‌ నెలలో ఐదు రోజులపాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమాశాలను కూడా జరపనుంది. ఈ సమావేశాల్లో ఒకే దేశం -ఒకే ఎన్నికలపై బిల్లును ప్రవేశపెడతారని చెబుతున్నారు.

కాగా ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. 'ఒకే దేశం-ఒకే ఎన్నికల'పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరులో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడం సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఓవైపు ప్రతిపక్షాల కూటమి.. ఇండియా సమావేశాలు ముంబైలో జరుగుతుండటం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా అడుగులేస్తుండటంతో రాజకీయా పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

దేశవ్యాప్తంగా లోక్‌ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచనను మోదీ సర్కారు గత కొన్నేళ్లుగా బలంగా చేస్తోంది. ఇప్పుడు దీన్ని అమల్లోకి తెచ్చేలా మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఈ ఏడాది డిసెంబర్‌ లోపు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మిజోరాంలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే వచ్చే ఏడాది వేసవిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లోక్‌ సభతోపాటు ఈ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం గురువారం సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ సమావేశాలకు అజెండా ఏమిటనేది కేంద్రం తెలపలేదు. కానీ రాజకీయ విశ్లేషకులు అంతా మాత్రం జమిలి ఎన్నికల గురించే ఈ ప్రత్యేక సమావేశాలని ఊహాగానాలు చేస్తున్నారు. జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారంటూ మీడియా సైతం జోరుగా ప్రచారం చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా 'ఒకే దేశం.. ఒకే ఎన్నికల'పై మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడం.. ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.