రూ. 6 వేల జీతం.. కోట్లలో ఆస్తులు.. మైండ్ బ్లోయింగ్ సంపాదన గురూ..
ఒడిశాలో విజిలెన్స్ అధికారులకు చిక్కిన అవినీతి అధికారి ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 7 Jun 2026 6:55 PM ISTఒడిశాలో విజిలెన్స్ అధికారులకు చిక్కిన అవినీతి అధికారి ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.6 వేల జీతంతో ఉద్యోగంలో చేరిన అసిస్టెంట్ ఇంజనీర్ ఏకంగా కోట్ల ఆస్తులు సంపాదించాడు. అక్రమార్జనే ధ్యేయంగా ప్రజల డబ్బును దోచేసిన ఆ అవినీతి తిమింగళం లీలలు విజిలెన్స్ దృష్టికి వెళ్లాయి. కట్ చేస్తే, గురుడు ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాడు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అవినీతి ఉదంతంపై స్థానిక మీడియా కథనాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ అవినీతి చక్రవర్తి పేరే వైకుంఠనాథ్ బెహెరా. ఐటీడీఏలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పని చేస్తున్న ఇతగాడి అక్రమ సామ్రాజ్యం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే అంటున్నారు.
లాకర్లలో నోట్ల కట్టల గుట్టలు
వైకుంఠనాథ్ బెహెరాపై వచ్చిన ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు పక్కా ప్లాన్‌తో సోదాలు చేపట్టారు. ఆయన ఇళ్లు, ఆఫీసులతో పాటు బ్యాంకు లాకర్లను తెరిచి చూసిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఆ లాకర్లలో ఏకంగా రూ.2 కోట్ల విలువైన రూ.500 నోట్ల కట్టలు గుట్టలుగా దర్శనమిచ్చాయి. నోట్లను లెక్కించడానికి విజిలెన్స్ అధికారులు కౌంటింగ్ మిషన్లను వాడాల్సి వచ్చిందంటే ఈయన ఏ రేంజ్‌లో నొక్కేసాడో అర్థం చేసుకోవచ్చు.
5 బిల్డింగ్‌లు.. 13 ప్లాట్లు
నెలవారీ జీతంతో బతికే ఉద్యోగి సంపాదన చూసి విచారణాధికారులే అవాక్కయ్యారు. ప్రజల సొమ్మును అడ్డగోలుగా దండుకుని వేల గజాల స్థిరాస్తులను కూడబెట్టాడు. సోదాల్లో తేలిన ప్రాథమిక ఆస్తుల లిస్ట్ సంచలనంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకంగా 5 భారీ బిల్డింగ్‌లు కట్టిన బెహెరా, భవిష్యత్తు పెట్టుబడుల కోసం మరో 13 ఖరీదైన ప్లాట్లు సిద్ధం చేసుకున్నాడని అధికారులు గుర్తించారు. ఇవి కాకుండా భారీ ఎత్తున దొరికిన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర పెట్టుబడులపై విజిలెన్స్ లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ అవినీతి తిమింగలం వ్యవహారం బయటపడటంతో ఒడిశా స్థానిక మీడియాలో కథనాలు హోరెత్తిపోతున్నాయి. ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి నిధులను, టెండర్లను ఈయన ఏ విధంగా పక్కదారి పట్టించాడనే అంశాలపై మీడియా వరుస కథనాలతో ఊదరగొడుతోంది. కేవలం రూ. 6 వేల జీతంతో ప్రస్థానం మొదలుపెట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక డిపార్ట్‌మెంట్‌లో ఇతర పెద్దల హస్తం, బినామీల నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో విజిలెన్స్ లోతుగా దర్యాప్తు చేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైకుంఠనాథ్ బెహెరాను విజిలెన్స్ అధికారులు రిమాండ్‌కు తరలించారు.
