Begin typing your search above and press return to search.

మోడీ అభిమానం...ఎన్టీఆర్ కి అరుదైన గౌరవం

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పెద్దలు అంటే ఎంతో గౌరవం. బీజేపీలో ఆయన వాజ్ పేయి ఎల్ కే అద్వానీ శిష్యుడిగా ఉంటూ అంచెలంచెలుగా పైకి వచ్చారు.

By:  Tupaki Desk   |   3 May 2025 9:35 PM IST
మోడీ అభిమానం...ఎన్టీఆర్ కి అరుదైన గౌరవం
X

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పెద్దలు అంటే ఎంతో గౌరవం. బీజేపీలో ఆయన వాజ్ పేయి ఎల్ కే అద్వానీ శిష్యుడిగా ఉంటూ అంచెలంచెలుగా పైకి వచ్చారు. మోడీ అలాగే దేశంలో ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులను కూడా గుర్తు పెట్టుకుని వారిని సైతం గౌరవిస్తారు. ఆయా సందర్భాలలో వారి సేవలను గుర్తు తెచ్చుకుని ప్రస్తుతిస్తారు. అంతే కాదు వారి గురించి సభలలో గొప్పగా చెబుతారు.

సరైన సమయంలో వారికి పౌర పురస్కారాలను అందచేస్తారు. ఇక నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికే ఎన్టీఆర్ ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఆయన 1996లో కన్ను మూసేనాటికి మోడీ గుజరాత్ లో బీజేపీకి కీలకంగా పనిచేస్తున్నారు.

మోడీ తెర వెనక వ్యూహాలను రచిస్తూ బీజేపీని సొంత రాష్ట్రంలో నిలబెడుతూ అనూహ్యంగా 2001లో గుజరాత్ సీఎం గా ఒకేసారి అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. ఇక మోడీ 2013లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన 2014 ఎన్నికల ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చినపుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని మనసారా తలచుకున్నారు.

కాంగ్రెస్ ప్రాభవాన్ని దక్షిణాదిన ఎదురొడ్డి నిలిచిన మొనగాడుగా కూడా అభివర్ణించారు. అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా విపక్షాన్ని కూడగట్టడంలో ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉందని అనేక సార్లు చెప్పారు. తాజాగా అమరావతి సభలో సైతం ఎన్టీఆర్ గురించి చెబుతూ మోడీ ఆయన ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు.

ఇలా సమయం సందర్భం వచ్చినపుడల్లా ఎన్టీఆర్ ని కొనియాడుతున్న మోడీ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందిస్తారా అన్న చర్చ మొదలైంది. ఎన్టీఆర్ సినీ నటుడిగానే కాదు రాజకీయ నేతగా సంచలనాలు సృష్టించారు. ఆయన చిరస్మరణీయమైన సేవలను తెలుగు జాతికి అందించారు. వారి ముద్దు బిడ్డగా నిలించారు. అలాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా జాతీయ స్థాయిలో కూడా తన రాజకీయ నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు.

అటువంటి అన్న గారికి భారత రత్న ఇవ్వాలన్నది అందరి కోరిక. ఆయన మరణించి మూడు దశాబ్దాలకు దగ్గర అవుతోంది. ఆయన భారత రత్నకు అన్ని విధాలుగా అర్హులు అని అంతా అంటారు. అయితే అన్న గారు మరణించిన తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పదమూడేళ్లు మాత్రమే అధికారంలో ఉంది. మిగిలిన సమయం అంతా ఎన్డీయే ప్రభుత్వమే కేంద్రంలో పవర్ లో ఉంది. అందులో వాజ్ పేయి సర్కార్ ఆరేళ్ళు ఉంటే మోడీ ప్రభుత్వం పదకొండేళ్ళుగా ఉంది.

మరో వైపు చూస్తే ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా కీలక భాగస్వామిగా ఉంటూ వస్తోంది. అయినా అన్న గారికి భారత రత్న బహుదూరంగానే ఉంది. అయితే భారత రత్నను ఆయనకు ప్రకటించాలని అంతా ముక్త కంఠంతో కోరుతున్నారు.

తాజాగా చూస్తే అమరావతి పర్యటనలో సైతం మోడీ అన్న గారిని తలచుకుని పులకించిపోయారు. దాంతో ఈసారి భారత రత్న పురస్కారం తప్పకుండా ఆయనకు దక్కుతుందని అంతా భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ ఉంది కేంద్రంలో బీజేపీ మనుగడకు టీడీపీ ఎంపీలే కారణంగా ఉన్నారు. ఇక బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు.

ఒక విధంగా ఏపీలో అన్న గారి అభిమానులందరినీ ఆకర్షించేందుకు కూడా ఇదే సరైన సమయం అని అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా అంతా ఎన్టీఆర్ కి అరుదైన గౌరవం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. దాంతో ఈసారి భారత రత్న ఆయనకు ఇచ్చేందుకు నరేంద్ర మోడీ సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఎపుడు భారత రత్న పురస్కారాలు ప్రకటించినా అందులో ఒక పేరుగా ఎన్టీఆర్ ది ఉంటుందని అంటున్నారు.

ఇక్కడ ఒక విషయం ఉంది ఎన్టీఆర్ కి భారత రత్న అంటే అది తెలుగు జాతికే గౌరవం. అంతా ఆనందిస్తారు. దేశ విదేశాలలో విస్తరించిన 18 కోట్ల మంది తెలుగు వారికే ఆ అవార్డు దక్కుతుంది. సో కేంద్రం ఈసారి ఆ దిశగా అడుగులు వేసి అన్న గారిని భారత రత్న చేస్తుందని అంతా నమ్ముతున్నారు.