Begin typing your search above and press return to search.

పీఏ గారి ఎమ్మెల్యే.. ఎన్ఆర్ఐ నేతకు చుక్కలు చూపిస్తున్న ఆఫీసు టీం?

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక ఎమ్మెల్యేకు ఆఫీసు సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2025 8:00 PM IST
పీఏ గారి ఎమ్మెల్యే.. ఎన్ఆర్ఐ నేతకు చుక్కలు చూపిస్తున్న ఆఫీసు టీం?
X

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక ఎమ్మెల్యేకు ఆఫీసు సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్ఆర్ఐగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆ నేత గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాముఖ్యం ఉండటంతో తక్కువ కాలంలోనే ఎమ్మెల్యేకు జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగినట్లు చెబుతున్నారు. ఆయన చెప్పిన ఏ పని అయినా అధికారులు కాదనకుండా చేస్తుండటం వల్ల రాజకీయంగా సదరు ఎన్ఆర్ఐ నేతకు మంచి మైలేజ్ పెరిగిందని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేకు వచ్చిన ఈ పాజిటివ్ టాక్ ను ఆయన పీఏ సొమ్ము చేసుకున్నాడనే ప్రచారమే తాజాగా హీట్ పుట్టిస్తోంది. పీఏతోపాటు ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేస్తున్న చాలా మంది సిబ్బంది చేతివాటంతో చెలరేగిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేకు కూడా సమాచారం అందడంతో ఆయన అప్రమత్తమయ్యారని అంటున్నారు.

రాజకీయాలే ప్రధాన వ్యాపకంగా ఎన్ఆర్ఐ నేత గడుపుతుంటే.. ఆయన పీఏ కాసులు దండుకునే పని మొదలుపెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ దందాలు బాగా ఎక్కువయ్యాయని, ఈ 18 నెలల కాలంలోనే బాగానే కూడబెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యేకు కొందరు సమాచారం ఇవ్వడంతో ఆయన అప్రమత్తమై పీఏని బాధ్యతల నుంచి తప్పించినట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు తనను అడ్డుపెట్టుకుని పీఏ సాగించిన దందాలను తెలుసుకుని ఎమ్మెల్యేనే బిత్తరపోయారని అంటున్నారు. పీఏతోపాటు ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది కూడా రెండు చేతులా దండుకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎన్ఆర్ఐ నేత షాక్ తిన్నారని చెబుతున్నారు. ఈ ఉదంతంతో ఎఫ్2 సినిమాలో చూపిన విధంగా సదరు ఎన్ఆర్ఐ నేత పీఏ గారి ఎమ్మెల్యే అయిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు.

పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే.. పీఏ దగ్గర నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి తప్పించారని చెబుతున్నారు. ఇక కేడర్ నుంచి ఫిర్యాదులతో మేల్కొన్న ఎమ్మెల్యే తన పీఏగా పార్టీలోని సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈ కారణంగానే కొద్దిరోజులుగా ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ నేత ఎక్కువగా కనిపిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్ఆర్ఐ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ ఉంటుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే ముందస్తుగా మేల్కొవడంతో విమర్శల నుంచి తప్పించుకున్నారని అంటున్నారు.

అయితే ఎన్ఆర్ఐ నేత ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి నియోజకవర్గంలో ఇలాంటి వ్యవహారాలే వెలుగు చూడటం చర్చనీయాంశం అవుతోంది. కొద్దిరోజుల క్రితం డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుడిగా తిరుగుతున్న వ్యక్తిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో ఎమ్మెల్యే అనుచరుడిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయంలో ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారని అంటున్నారు. ఆ ఉదంతం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా, పీఏ వ్యవహారం కలకలం రేపుతోంది. పీఏను విధుల నుంచి తప్పించినా, ఆయన బాధితులకు ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. పీఏ వసూలు చేసిన డబ్బు ఎవరెవరెకి అందిందో తేల్చాలని కేడర్ నిలదీస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ నేత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.