Begin typing your search above and press return to search.

వంగవీటి తనయుడికి నో సీటు.. రాధా రూటెటు?

టీడీపీ 94 స్థానాల్లో, జనసేన పార్టీ ఐదు స్థానాల్లో తమ అభ్యర్థులను వెల్లడించాయి.

By:  Tupaki Desk   |   25 Feb 2024 8:23 AM GMT
వంగవీటి తనయుడికి నో సీటు.. రాధా రూటెటు?
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన పార్టీలు తమ కూటమి తరఫున తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. టీడీపీ 94 స్థానాల్లో, జనసేన పార్టీ ఐదు స్థానాల్లో తమ అభ్యర్థులను వెల్లడించాయి.

కాగాఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 స్థానాల్లో అత్యధిక సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మైలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ, కైకలూరు, పెనమలూరు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో రెండు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని టాక్‌ నడుస్తోంది.

కాగా దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సీటు దక్కకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. 2019 ఎన్నికల ముందు రాధా ఆశించిన విజయవాడ సెంట్రల్‌ సీటును ఆయనకు ఇవ్వకపోవడంతో రాధా వైసీపీ నుంచి తప్పుకున్నారు. టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.

2019 ఎన్నికల్లో రాధా పోటీ చేయలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని ఆ పార్టీ అప్పట్లో హామీ ఇచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో రాధా ఏ పదవిలోనూ లేకుండా మిగిలిపోయారు.

2004లో తొలిసారి వంగవీటి రాధా కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేసిన రాధా కేవలం 750 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ తరఫున మరోసారి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2019లో విజయవాడ సెంట్రల్‌ సీటును రాధాకు నిరాకరించిన వైసీపీ ఆయనను మచిలీపట్నం పార్లమెంటు నుంచి లేదా అవనిగడ్డ లేదా విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించింది. అయితే రాధా ఈ ప్రతిపాదనలను తిరస్కరించి టీడీపీలో చేరారు.

ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా ప్రకటించిన జాబితాలో రాధాకు విజయవాడ సెంట్రల్‌ సీటు దక్కలేదు. ఈ సీటును మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా ఉమాకు చంద్రబాబు కేటాయించారు. దీంతో వంగవీటి రాధా ఏ రూటు ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

రాధా ప్రస్తుత పరిణామాలను గమనిస్తున్నారని.. ఖచ్చితంగా ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా ఇటీవల కాలంలో వైసీపీ తిరిగి రాధాను తమ పార్టీలో ఆహ్వానించింది. రాధా సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు. జగన్‌ సైతం రాధా తిరిగి పార్టీలోకి వస్తే మంచి పదవి ఇస్తామని ఆఫర్‌ చేశారు. అయినా రాధా వైసీపీలోకి వెళ్లలేదు.

అంతేకాకుండా ఇటీవల విజయవాడ వైసీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవకుమార్‌ టీడీపీలో చేరడంతో వంగవీటి రాధాదే కీలకపాత్ర. భవకుమార్‌ ఇంటికి వెళ్లిన రాధా ఆయనను టీడీపీలో చేరడానికి ఒప్పించారు.

టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో ప్రచారం చేసిపెట్టి, ఇప్పుడు కీలక నేతలను టీడీపీలో చేర్చినా రాధాకు సీటు దక్కకపోవడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయని అంటున్నారు. గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు చంద్రబాబును, లోకేశ్‌ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాళ్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే వారితో అంటకాగుతున్న రాధాకు చంద్రబాబు సీటు నిరాకరించారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ పార్టీలో చేరతారనేది ప్రాధాన్యం సంతరించుకుంది.