Begin typing your search above and press return to search.

'అహీమ్' సంస్థ ముసుగులో ఉగ్ర శిక్షణ.. 20 మందిని మానవ బాంబులుగా సిద్దం చేసిన సిరాజ్?

NIA విచారణలో సిరాజ్, సమీర్‌లు వెల్లడించిన వివరాలు దేశ భద్రతకు తీవ్ర ముప్పును సూచిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 May 2025 4:27 PM IST
అహీమ్ సంస్థ ముసుగులో ఉగ్ర శిక్షణ.. 20 మందిని మానవ బాంబులుగా సిద్దం చేసిన సిరాజ్?
X

ఏపీలో బయటపడిన ఉగ్ర కుట్ర కేసులో నిందితులు, ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న సిరాజ్, సమీర్ లను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వెల్లడవుతున్న విషయాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. సిరాజ్ 'అహీమ్' (Ahim) అనే సంస్థను స్థాపించి, ఏకంగా 20 మంది యువకులను మానవ బాంబులుగా (Human Bombs) మార్చడానికి సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ కుట్ర వెనుక విదేశీ నిధులు, పక్కా ప్రణాళిక ఉన్నట్లు NIA అధికారులు గుర్తించారు.

NIA విచారణలో సిరాజ్, సమీర్‌లు వెల్లడించిన వివరాలు దేశ భద్రతకు తీవ్ర ముప్పును సూచిస్తున్నాయి. వారి ప్లాన్ ప్రకారం సిరాజ్ 'అహీమ్' అనే సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా సుమారు 20 మంది యువకులను ఉగ్ర కార్యకలాపాలకు, ముఖ్యంగా ఆత్మాహుతి దాడులకు సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరిని బ్రెయిన్ వాష్ చేసి, మానవ బాంబులుగా మారడానికి శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇది దేశంలో అరుదుగా కనిపించే, అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర వ్యూహం.

ఈ ఉగ్రవాదులు దేశంలోని కీలక మెట్రో నగరాలైన విజయనగరం, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పేలుళ్లకు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. రద్దీ ప్రాంతాలు, ప్రముఖ ప్రదేశాలు, కీలక సంస్థలు వారి లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నగరాల్లో ఒకేసారి లేదా దశలవారీగా దాడులు జరిపి దేశంలో భయానక వాతావరణం సృష్టించాలనేది వారి ప్రణాళికగా ఉంది.

NIA అధికారులు జరిపిన దర్యాప్తులో ఈ ఉగ్రవాదులకు సౌదీ అరేబియా, ఒమన్ దేశాల నుంచి ఆర్థిక సాయం అందినట్లు గుర్తించారు.ఇది ఈ ఉగ్ర కుట్ర వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని బలమైన సూచన ఇస్తోంది. విదేశాల నుంచి నిధులు సమకూర్చుకుని, దేశీయంగా యువకులను రిక్రూట్ చేసుకుని, వారిని ఉగ్ర కార్యకలాపాలకు ఉసిగొల్పడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ కేసులో ఇంకెంత మంది వ్యక్తులు, సంస్థలు పాలుపంచుకున్నాయి. నిధులు ఎలా సమకూరాయి. శిక్షణ ఎక్కడ జరిగింది వంటి విషయాలపై NIA లోతుగా దర్యాప్తు చేస్తోంది. సిరాజ్ స్థాపించిన 'అహీమ్' సంస్థ పేరు, దాని కార్యకలాపాలు, సభ్యులు ఎవరు అనే వివరాలను కూడా NIA వెలికి తీస్తోంది. ఈ ఘటన జాతీయ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది. దేశంలో మానవ బాంబులను సిద్ధం చేయడం అనేది తీవ్రమైన పరిణామం. ఇలాంటి కుట్రలను ఆదిలోనే తుంచివేయడం ద్వారా పెద్ద నష్టాన్ని నివారించవచ్చని భద్రతా నిపుణులు అంటున్నారు. దేశంలోని నిఘా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తుల కదలికలపై నిఘా పెంచాయి.

ఈ కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి కుట్రలను అణచివేయడానికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు తెలిస్తే భద్రతా సంస్థలకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.