డజన్ పెళ్లిళ్లు చేసుకోలేదు.. అదంతా స్క్రిప్టు.. కొత్త ట్విస్టు!
పేరున్న ప్రధాన మీడియా సంస్థల్లో పబ్లిష్ అయ్యే కథనాలకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా జరిగే ఘోరమైన తప్పులు కొత్త రచ్చకు తెర తీస్తాయి.
By: Tupaki Desk | 25 Jun 2025 11:51 AM ISTపేరున్న ప్రధాన మీడియా సంస్థల్లో పబ్లిష్ అయ్యే కథనాలకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా జరిగే ఘోరమైన తప్పులు కొత్త రచ్చకు తెర తీస్తాయి. ఇలాంటి వేళలో.. అంత పేరున్న మీడియా సంస్థ తప్పులో ఎలా కాలేసింది? క్రాస్ చెక్ సరిగా ఎందుకు జరగలేదు? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. మంగళవారం కొన్ని ప్రముఖ మీడియా సంస్థల్లో ఒక వార్త హైలెట్ అయ్యింది. అదేమంటే ఏపీలోని రామచంద్రాపురానికి చెందిన నీలిమ అనే మహిళ ఇప్పటికే డజను పెళ్లిళ్లు చేసుకుందని.. అదంతా రెండేళ్ల వ్యవధిలో అంటూ ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు.
ఒకరికి తెలీకుండా ఒకరిని.. మొత్తంగా పన్నెండు మందిని పెళ్లాడి మోసం చేసినట్లుగా ఆరోపణలతో కూడిన వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిత్యపెళ్లికూతురుగా వార్తల్లో నలిగిన నీలిమ తన వాదనను వినిపించేందుకు పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తనకు ఇప్పటివరకు ఒక్క పెళ్లి మాత్రమే జరిగిందని..అయితే తాను పన్నెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా వచ్చిన వార్తల్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
‘నాకు డజను పెళ్లిళ్లు జరిగాయని ప్రచారం చేశారు. ఆ వివరాలు చూపించండి. ఒకవేళ చూపించలేకపోతే వారిపై న్యాయపోరాటం చేస్తా. నా మీద ఆరోపణలు చేస్తున్న వారిపై పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం సాగుతున్నట్లుగా పేర్కొన్న ఆమె.. కొత్త విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. తనకు 2023 సెప్టెంబరు ఆరున పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పాస్టర్ బేర్నేష్ తో పెళ్లి పక్కా అయ్యిందని చెప్పారు.
అనుకున్న ముహుర్తానికి ముందే ఇంటికి వచ్చిన పాస్టర్ బేర్నేష్.. ఎంగేజ్ మెంట్ చేసుకుందామని చెప్పి.. ఏకంగా మెడలో తాళి కట్టాడని.. ఇదేంటని తన తల్లి ప్రశ్నిస్తే ఇదే పెళ్లి అంటూ చెప్పాడన్నారు. తన మెడలో తాళి కట్టేందుకు ముందు.. తాను విడాకులు తీసుకున్నట్లు నమ్మించాడన్నారు. ఈ సమయంలోనే బేర్నేష్ మొదటి భార్య ఫోన్ చేసి.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తన భర్త ఇంకా విడాకులు ఇవ్వలేదని చెప్పటంతో పోలీసులకు తాను కంప్లైంట్ ఇచ్చారన్నారు. దీనికి సంబంధించిన కేసు నమోదైందని.. అప్పటి నుంచి పాస్టర్ నుంచి తాను బెదిరింపులకు గురవుతున్నట్లుగా వాపోయారు. ఇందులో భాగంగానే తనపై తప్పుడు కథనాలు అల్లినట్లుగా ఆరోపించారు. నీలిమ వ్యాఖ్యలకు బలం చేకూరేలా రామచంద్రాపురం సీఐ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. నిత్య పెళ్లికూతురిగా వ్యవహరిస్తూ నీలిమ పన్నెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
అయితే..ఈ మొత్తం వ్యవహారం ఇంత ప్రముఖంగా వార్త ఎందుకు వచ్చింది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. నీలిమ.. గుర్రం రాజేశ్వరి అనే మహిళ మధ్య.. వారి కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం రాజేశ్వరి అమలాపురం ఎస్పీ ఆఫీసులో నీలిమపై కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని ఆదారంగా చేసుకొని అత్యుత్సాహంతో.. కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా ఈ ఉదంతాన్ని వార్తగా రాయటం.. అది కాస్తా ప్రముఖంగా రావటం జరిగినట్లు చెబుతున్నారు. సంచలన వార్తలకు సంబంధించి సరైన క్రాస్ చెక్ అన్నది జరగాలి. నీలిమ విషయంలో ఇలాంటివేమీ జరగలేదు.
