సీఎం రేవంత్ స్పీచ్ తర్వాత ఏం జరిగిందో.. తెలుగు మీడియా మిస్ అయ్యింది
కానీ.. ప్రాంతీయ మీడియాకు కీలకమైన అంశాల్ని ప్రధాన మీడియా సంస్థలు మిస్ కావటం చూసినప్పుడు.. కొన్ని కీలక అంశాలకు అసలు ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది
By: Tupaki Desk | 21 Feb 2026 9:47 AM ISTజాతీయ మీడియాకు ముఖ్యమైనది కాకపోవచ్చు. కానీ.. ప్రాంతీయ మీడియాకు కీలకమైన అంశాల్ని ప్రధాన మీడియా సంస్థలు మిస్ కావటం చూసినప్పుడు.. కొన్ని కీలక అంశాలకు అసలు ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. మీడియా సంస్థల ప్రాధాన్యతలు.. ప్రయార్టీలను చూసుకున్నా.. స్థానిక అంశాలకు పెద్దపీట వేయాలి కదా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే.. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఒక చారిత్రక స్పీచ్ కు ఒక మోస్తరు ప్రాధాన్యతను ఇవ్వటం మినహా.. దానికి సంబంధించి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని కవర్ చేసే విషయంలో ప్రదర్శించిన తీరు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
నోరు తెరిస్తే చాలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తిట్టే తిట్లకు ఎంత టోడైనా బెదిరిపోవాల్సిందేనని.. ఆయన నోట్లో నానకుండా ఉండాలన్నట్లుగా కొందరు భావిస్తారు. తమకు తాము రేవంత్ కంటే మెరుగైన నేతలమని భావించే ప్రత్యర్థులకు తప్పు వదిలేలా.. తిట్ల దండకాన్ని అందుకునే తీరుకు జడవాల్సిందే. అలాంటి రేవంత్ లో మరో ఆసక్తికర కోణం ఏమంటే.. ఒక అంతర్జాతీయ సమ్మిట్ లో ప్రసంగించటం ఒక ఎత్తు అయితే.. టైమ్లీగా మాట్లాడటం.. అందరి చూపు తన మీద పడేలా చేయటం మామూలు విషయం కాదు.
అందుకు నిదర్శనంగా ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చెప్పాలి. తనకు ఇచ్చిన పదకొండు నిమిషాల సమయాన్ని అద్భుతంగా వినియోగించుకున్న రేవంత్.. ఏఐపై విజన్ ఎలా ఉండాలి? పాలసీ పరంగా ప్రభుత్వాలుఏం చేయాలి? భారతదేశం ఏం చేస్తే బాగుంటుంది? లాంటి ప్రశ్నల్ని సంధించకుండా.. స్పష్టమైన సూచనలు చేయటం విశేషం. ఆయన ప్రసంగంలోని స్పష్టత జాతీయ, అంతర్జాతీయ అధినేతలతో పాటు.. టెక్ ప్రపంచంలో దిగ్గజాలు అనే వారిని సైతం సీఎం రేవంత్ వైపు చూసేలా చేశాయి. అందుకు తగ్గట్లే.. సీఎం రేవంత్ ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చప్పట్లు కొట్టటం మాత్రమే కాదు.. అభినందన పూర్వకంగా వ్యవహరిచటం హైలెట్ గా చెప్పాలి.
అంతేనా.. సీఎం రేవంత్ ప్రసంగం తర్వాత ఆయన్ను తన పక్క కూర్చీలో కూర్చోబెట్టుకొని మాట్లాడటం.. పలు అంశాల్ని చర్చించటం.. కార్యక్రమం జరిగిన అరగంట సేపు ఆయన పక్కన సీట్లోకూర్చెబెట్టుకోవటం లాంటివి కీలక పరిణామాలు ఎందుకు కావు? అలాంటి అంశాల్ని కవర్ చేయాల్సిన బాధ్యత జాతీయ మీడియాకు ఉండకపోవచ్చు. కానీ.. ప్రాంతీయ మీడియా.. అందునా తెలుగు మీడియా.. అదీ కాదనుకుంటే.. కనీసం తెలంగాణలోని ప్రధాన మీడియా సంస్థలైనా కవర్ చేయాలి కదా? ఆ అంశాల్ని ప్రస్తావించాలి కదా? అదేమీ చేయకుండా.. ఆయన స్పీచ్ ను యాంత్రికంగా.. సీఎంవో ఇచ్చిన పస లేని (పూర్తిగా కాకున్నా సీఎం రేవంత్ మాట్లాడినంత ఎఫెక్ట్ తరహాలో) ప్రెస్ నోట్ ను ఇచ్చేస్తే ఏం బాగుంటుంది? దేశ ప్రధాని మోడీని ఆకర్షించటంతో పాటు.. ఇతర దేశాధినేతలు సైతం సీఎం రేవంత్ ప్రసంగానికి ఫిదా అయినట్లుగా ఏఐ సమ్మిట్ లో జరిగిన పరిణామాలు ఏవీ తెలుగులోని దిగ్గజ మీడియా సంస్థల చూపు పడకపోవటం దేనికి నిదర్శనం?
