Begin typing your search above and press return to search.

మోడీ సార్ : ఓన్లీ డైలాగ్స్.. నో యాక్షన్ ..!?

దాంతో ఏలూరు సభకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన నరేంద్ర మోడీ అప్పటి సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   8 May 2024 1:47 PM GMT
మోడీ సార్ :  ఓన్లీ డైలాగ్స్.. నో యాక్షన్ ..!?
X

ఏపీకి వచ్చినప్పుడల్లా మోడీ అమిత్ షాలు అధికార పార్టీ మీద నిప్పులు చెరుగుతూ ఉంటారు. అదీ ఎన్నికల వేళలో అయితే ఇంకాస్తా జోరు పెంచుతారు. తీరా ఎన్నికల తరువాత చూస్తే అంతా మామూలుగా ఉంటుంది. ఇది ఏపీ ప్రజలకే కాదు తెలుగు ప్రజలకూ అనుభవంగానే ఉంటోంది. 2019లో టీడీపీ మోడీకి ఎదురు నిలిచి పోటీ చేసింది. దాంతో ఏలూరు సభకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన నరేంద్ర మోడీ అప్పటి సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.

అవినీతి కుటుంబ పాలన అని హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం ఏటీఎం లా చేసి అవినీతి సొమ్ము దోచుకున్నారని కూడా నిందించారు. సీన్ కట్ చేస్తే ఇదే చంద్రబాబు ఇపుడు మోడీ పక్కన ఉన్నారు. 2024 ఎన్నికల్లో మోడీ వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అవినీతి సర్కార్ అంటున్నారు. మాఫియా పాలన అంటున్నారు. గూండా రాజ్ అని కూడా విమర్శిస్తున్నారు. అమిత్ షా కూడా ఇదే రకంగా విమర్శలు చేసి వెళ్లారు.

ఈ ప్రభుత్వం మీద చర్యలు ఉంటాయని అంటున్నారు. అందరికీ ట్రీట్మెంట్ ఉంటుందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలోనూ కేంద్రంలోనూ ఏర్పాటు అయ్యాక ప్రతీ మాఫియాకూ ట్రీట్మెంట్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే రకంగా తెలంగాణాలోనూ మోడీ మాట్లాడారు, కేసీఆర్ సర్కార్ అవినీతిమయం అన్నారు. యాక్షన్ తీసుకుంటామని అన్నారు. కానీ ప్రజలే ఆ ప్రభుత్వాన్ని దించారు తప్ప కేంద్రం నుంచి ఏ రకమైన యాక్షన్ లేదు.

లిక్కర్ స్కాం లో కవితను అరెస్ట్ చేయడం సంగతి పక్కన పెడితే పదేళ్ళ పటు పాలించి తెలంగాణాను దోచేశారు అని బీఆర్ఎస్ నేతల మీద మోడీ అమి షా చేసిన కామెంట్స్ వాటి మీద చర్యలు ఏవీ అని అంతా చర్చించుకున్న సందర్భం ఉంది. తెలంగాణాలో కేసీఆర్ పదేళ్ల పాటు రాజ్యం చేస్తే కేంద్రంలో మోడీ కూడా అధికారం చలాయిస్తున్నారు.

మరి ఎన్నికల సభలలోనే విమర్శలు చేయడం తప్ప ఎందుకు యాక్షన్ కి దిగలేకపోయారు అన్నది సగటు జనంలో ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇక ఏపీలో చూస్తే 2014 నుంచి 2018 దాకా చంద్రబాబు మిత్రుడుగా ఎన్డీయేలో ఉన్నారు. పోనీ అలా చూసీ చూడనట్లుగా వదిలేసారు అనుకున్నా 2018 తరువాత ఆయన బయటకు వచ్చి మోడీ ప్రభుత్వం మీద యుద్ధం చేశారు కదా ఏపీలో అవినీతి జరుగుతోంది అని బీజేపీ పెద్దలు పదే పదే చెప్పారు కదా. దాని మీద విచారణ కానీ ఏదైనా చేశారా అంటే లేదు.

పోనీ 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు అయిదేళ్ళ పాలన మీద విచారణ చేశారా అంటే అదీ లేదు. తీరా ఎన్నికల ముందు ఆయన్ని ఎన్డీయే జట్టులో చేర్చుకుని బాబు భేష్ అంటున్నారు.అంటే తాము చెప్పిన మాటలు అన్నీ తూచ్ అని జనాలు అనుకోవాలనా అన్నది బీజేపీ పెద్దలు చెప్పాల్సి ఉంది అంటున్నారు.

ఇపుడు చూస్తే అయిదేళ్ల వైసీపీ పాలన అవినీతి మయం అక్రమాల మయం అయినపుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇన్నాళ్ళూ ఏమి చేస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. కేంద్రం తన వద్ద నున్న దర్యాప్తు సంస్థలతో ఏపీలో జరుగుతున్న అవినీతి మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు.

పోనీ కేంద్రానికి ఈ విషయాలు సరిగ్గా తెలియవు అనుకుంటే గత ఏడాది బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా నియమితురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీలో లిక్కర్ స్కాం అని ఏకంగా కేంద్రానికి అతి పెద్ద ఫిర్యాదు చేశారు. అలాగే అనేక రకాలైన ఆరోపణలతో ఆమె ఒక నోట్ ని సమర్పించారు. మరి ఆనాడు మాట్లాడకుండా కనీసంగా కూడా రెస్పాండ్ కాకుండా తీరా ఎన్నికల వేళ వైసీపీ అవినీతి చేసింది అని కొత్త మాటగా పాత విషయాలను చెప్పడం అంటే ఏమనుకోవాలన్న ప్రశ్నలు వస్తున్నాయి.

తాము ఏమి చెప్పినా జనాలు వింటారు అన్నది ఒక ధోరణిగా బీజేపీ పెద్దల విషయంలో కనిపిస్తూంటే మరోటి ఏంటి అంటే ఏపీని ఏపీ రాజకీయ పార్టీలను తమ గుప్పిట పెట్టుకోవడం కోసమే ఈ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు అని అంటున్నారు. వామపక్ష నేతలు ఈ విధంగానే మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయాన్ని తమ గుప్పిట పెట్టుకుని ఒక్క సీటూ తమకు లేకపోయినా ఆటాడించడానికే ఇదంతా చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు.

మరి మోడీ ఎన్నికల వేళ చేస్తున్న గంభీర ప్రకటనలు హెచ్చరికలు చూసిన వారు ఏమనుకుంటున్నారు. సీరియస్ గా తీసుకుంటున్నారా అంటే ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా ఏపీలో అవినీతి గత పదేళ్ళుగా రెండు ప్రభుత్వాలలో సాగింది అని మోడీయే 2019, 2024లలో ఏకంగా బహిరంగ సభలలోనే ప్రకటించారు. వివక్ష లేకుండా తన తర భేదాలు లేకుండా ఏపీలో పదేళ్ల పాలనలో చోటు చేసుకున్న అవినీతి మీద ఈసారి అధికారంలో వచ్చిన తరువాత అయినా సమగ్రమైన విచారణ జరిపించి అవినీతిలో చిక్కుకున్న ప్రజల సొమ్ముని బయటకు తెస్తేనే బీజేపీ పట్ల జనాలకు నమ్మకం కుదురుతుంది అని అంటున్నారు.