Begin typing your search above and press return to search.

మోడీకి అరవై సీట్లు తగ్గుతున్నాయా...బాబు జగన్ కీ రోల్ !

దేశంలో బీజేపీకి అనుకున్నంత ఊపు అయితే కనిపించడం లేదు. ఇప్పటికి నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి

By:  Tupaki Desk   |   17 May 2024 11:46 AM GMT
మోడీకి అరవై  సీట్లు తగ్గుతున్నాయా...బాబు జగన్ కీ రోల్ !
X

దేశంలో బీజేపీకి అనుకున్నంత ఊపు అయితే కనిపించడం లేదు. ఇప్పటికి నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మీడియాకు విషయం అర్ధం అవుతోంది. బీజేపీ పెద్దలకూ అన్నీ తెలుస్తున్నాయి. కానీ వారు వాస్తవాలను అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బీ ఉందా అని మీడియా అమిత్ షాని ప్రశ్నిస్తే ప్లాన్ బీ అన్న ప్రసక్తే లేదు అని బదులిచ్చారు.

ప్లాన్ ఏ అంటే పూర్తి స్థాయిలో బీజేపీకి మెజారిటీ రావడం. అది విఫలం అంటే బీజేపీకి అనుకున్న స్థాయిలో సీట్లు రావు ని మీడియావే డౌట్ పడుతోంది అని అంటున్నారు. ఇక ఉత్తరాదిన కీలకమైన రాష్ట్రాలలో సైతం బీజేపీ కొంత ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. పోలింగ్ మొదలయ్యాక మెల్లగా ఇండియా కూటమి బలపడడం కూడా బీజేపీని కలవరపెడుతున్న మరో అంశంగా ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే మోడీకి ఆయన పార్టీకి ఈసారి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు తగ్గే చాన్స్ ఉందని అంటున్నారు. 2019 ఎన్నికలో ఉత్తరాదిన పిండాల్సిన సీట్లు అన్నీ పిండేశారు. సో ఇపుడు అక్కడ బీజేపీకి ప్లస్ గా వచ్చే సీట్లు ఏమీ లేవు. మైనస్ గానే ఉంటాయి. దాంతో ఎన్ని సీట్లు ఈసారి బీజేపీకి తగ్గుతాయి అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.

ఏ భావోద్వేగం లేని ఎన్నికగా ఈసారి ఉన్నది. అంతే కాదు ఏ మాత్రం బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రభావం పెద్దగా చూపించలేని ఎన్నికగా కూడా ఇది ఉంటోంది. దాంతో ముస్లిం రిజర్వేషన్ లు అంటూ మోడీ అమిత్ షా ఒక కీలక అంశాన్ని జనంలో చర్చకు పెట్టినా అనుకున్న స్థాయిలో అయితే స్పందన రావడంలేదు అని అంటున్నారు. దీంతో బీజేపీలో మెల్లగా కలవరం మొదలైంది అని అంటున్నారు.

ఇక సమీక్షలు చూసినా బీజేపీ వద్ద ఉన లెక్కలు చూసినా చాలా సీట్లు ఈసారి తగ్గుతాయని అంటున్నారు. యూపీ నుంచి గతసారి కంటే ఈసారి ఏడెనిమిది సీట్లు బీజేపీకి తగ్గవచ్చు అని అంటున్నారు. అలాగే రాజస్థాన్ లో నాలుగైదు సీట్లు, గుజరాత్ లో రెండు మూడు సీట్లు, ఢిల్లీలో రెండు మూడు సీట్లు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకటి రెండు సీట్లు, హర్యానాలో రెండు మూడు సీట్లు, కర్నాటకలో ఏకంగా ఏడు నుంచి తొమ్మిది ఎంపీ సీట్లూ బీజేపీకి ఈసారి తగ్గవచ్చు అని అంటున్నారు

ఇకపోతే బీహార్ లో కూడా ఆరేడు సీట్లు బీజేపీకి ఈసారి తగ్గుతాయని అంటున్నారు. మహారాష్ట్రలో సైతం బీజేపీ కూటమికి ఆరేడు సీట్లు తగ్గుతాయని అంటున్నారు. ఇలా చెప్పుకున్న స్టేట్స్ అన్నీ బీజేపీకి అతి ముఖ్యమైనవి. రాజకీయంగా బీజేపీకి అందలాన్ని అందించినవి. ఈ సీట్లు కనుక బీజేపీ కోల్పోతే మాత్రం చాలా భారీ నష్టం ఏర్పడుతుంది అని అంటున్నారు.

అయితే తెలంగాణాలో రెండు మూడు సీట్లు ఏపీలో మూడు సీట్లు అదనంగా బీజేపీ ఖాతాలోకి చేరవచ్చు అని అంటున్నారు. అలా దక్షిణ కర్నాటకలో బీజేపీకి తగ్గే సీట్లను తెలుగు రాష్ట్రాల ద్వారా ఎంతో కొంత భర్తీ చేసుకోవచ్చు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఉత్తర భారతాన జాట్లు, రాజ్ పుట్స్ ల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీని భుజాలకెత్తుకొని మోసిన జాట్లు ఈసారి బాయ్ కాట్ మోడీ బాయ్ కాట్ బీజేపీ అని నినాదాలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇక యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ రాజ్ పుట్ అన్నది తెలిసిందే. మోడీ ఈసారి గెలిస్తే కనుక యోగీని సీఎం పదవి నుంచి మార్చేస్తారు అని అంటున్నారు.

దీంతో రాజ్ పుట్స్ మోడీ మీద గుర్రుగా ఉన్నారని వారి ఓట్లు బీజేపీకి పెద్ద ఎత్తున దక్కే సీన్ అయితే లేదు అని అంటున్నారు. ఇక ఆర్మీ లో నియామకాలను అగ్నివీర్ ద్వారా చేస్తున్నారు కాబట్టి హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలలో యువత బీజేపీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు.

ఇక ఈ విశ్లేషణలు లెక్కలు అన్నీ చూసుకున్నపుడు బీజేపీకి కచ్చితంగా సొంతంగా ఆధిక్యత రాదు అని అంటున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 273కి సరిపడా ఎంపీలు బీజేపీకి దక్కవని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీకి ఏపీ నుంచి చంద్రబాబు జగన్ ల మద్దతు అవసరం పడవచ్చు అని అంటున్నారు. ఒక విధంగా ఈ ఇద్దరు నేతలకు వచ్చే ఎంపీ సీట్లతోనే బీజేపీ బండి కేంద్రంలో నడవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం కండిషన్ లు పెట్టి ఏపీకి న్యాయం చేసేందుకు కృషి చేయవచ్చు అని అంటున్నారు.

ఏది ఏమైనా బీజేపీకి 2014, 2019లలో ఫుల్ మెజారిటీ రావడం వల్ల ఏపీని అసలు ఖాతరు చేయలేదు. కానీ ఈసారి ఏపీ పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు అయితే మాత్రం బీజేపీ కచ్చితంగా ఏపీ మీద ఫోకస్ పెట్టాల్సిందే అంటున్నారు. అపుడు ప్రత్యేక హోదా రాజధానికి నిధులు పోలవరం నిధులు విభజన హామీలు వంటి వాటి విషయంలో బీజేపీ నుంచి కచ్చితమైన హామీలు తీసుకుని వాటిని సాధించే బాధ్యత మాత్రం బాబు జగన్ ల మీదనే ఉంది అని అంటున్నారు.