Begin typing your search above and press return to search.

మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తా: లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Aug 2023 3:59 AM GMT
మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తా: లోకేష్
X

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులతో భేటీ అయిన లోకేష్ సంచలన ప్రకటన చేశారు. అమరావతి ఆక్రందన పేరుతో తాడికొండలో సభ నిర్వహించిన అనంతరం రైతులకు లోకేష్ తీపికబురందించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే మూడేళ్లలోపు అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రైతులకు లోకేష్ హామీ ఇచ్చారు.

ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, ఆ కలను సాకారం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని లోకేష్ రైతులకు భరోసా ఇచ్చారు. ప్రజా రాజధాని అమరావతిని అద్భుతంగా మూడేళ్లలో తీర్చిదిద్దుతామని, అంతేకాకుండా అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో మూడేళ్ల కాలంలో చేసి చూపిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి జై కొట్టిన జగన్ ఎన్నికలలో గెలిచిన తర్వాత మూడు రాజధానులు అంటూ రైతులను మోసం చేశాడని లోకేష్ విరుచుకుపడ్డారు.

కులం పేరుతో రాజకీయాలు చేసిన జగన్ అమరావతిని పాతాళానికి తొక్కేశారని దుయ్యబట్టారు. టిడిపి అధినేత చంద్రబాబు హయాంలోని ప్రభుత్వాన్ని నమ్మి మూడు పంటలు పండే పచ్చటి పంట పొలాలను రైతులు రాజధాని కోసం త్యాగం చేశారని, కానీ జగన్ సీఎం అయిన తర్వాత 30 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు పోరుబాట పట్టారని, కానీ వారి ఉద్యమాన్ని జగన్ ఉక్కు పాదంతో అణచివేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైతులు తమ పొలాలను త్యాగం చేశారని, కానీ అమరావతిని నిర్వీర్యం చేసి చేసి ఆంధ్రుల భవిష్యత్తును జగన్ అంధకారంలోకి నెట్టివేశారని లోకేష్ నిప్పులు చెరిగారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సైకో జగన్ ను గద్దె దింపితేనే అమరావతికి, ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని లోకేష్ విమర్శలు గుప్పించారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోమని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

జగన్ వంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అని, అందుకే ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం టిడిపి చేపట్టిందని గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారందరినీ జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమని రైతులకు భరోసానిచ్చారు.