Begin typing your search above and press return to search.

లోకేష్ తమ్ముళ్ళకు బాగా నచ్చేస్తున్నాడా....!?

నారా లోకేష్ రాజకీయంగా ఆరితేరుతున్నారు. ఒకప్పుడు పప్పు అని అన్న వాళ్ళే ఇపుడు కాదు అని ఒప్పుకుంటున్నారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 10:30 AM GMT
లోకేష్ తమ్ముళ్ళకు బాగా నచ్చేస్తున్నాడా....!?
X

నారా లోకేష్ రాజకీయంగా ఆరితేరుతున్నారు. ఒకప్పుడు పప్పు అని అన్న వాళ్ళే ఇపుడు కాదు అని ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా పాదయాత్ర నుంచి లోకేష్ దూకుడు పెంచారు. గతంలో లోకేష్ మీడియా ముందు మాట్లాడినా సభలలో మాట్లాడినా ఎక్కడో ఒక చోట తప్పులు దొర్లేవి. కానీ ఇపుడు అలా కాదు, ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు. అందులో పంచులు పేలుస్తున్నారు.

అంతే కాదు కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడడమే లోకేష్ స్పెషాలిటీ. ఇది తండ్రి చంద్రబాబుకు పూర్తి భిన్నం. అలాగే ఎవరినైనా నమ్మితే వారి విషయంలో గట్టిగా నిలబడడం లోకేష్ నైజం అని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఒక ఇష్యూతో లోకేష్ వద్దకు వెళ్తే ఆయన ఏదో ఒకటి తేల్చేస్తారు. నానుస్తూ సాగదీయరు అని కూడా అంటున్నారు.

ఇక ఇదే చంద్రబాబు విషయమే తీసుకుంటే మాత్రం ఆయన అలా ఎటూ తేల్చకుండా చేస్తారు అని విమర్శలు ఉన్నాయి. ఇక చంద్రబాబుకు మొహమాటాలు ఉన్నాయి. ఆయన గబుక్కున ఎవరినీ కాదని అనుకోలేరు. పైగా తనను గతంలో తీవ్రంగా విమర్శించిన వారు ఉన్నా కూడా వారిని ఆయన మళ్ళీ దగ్గరకు తీస్తారు.

అదే లోకేష్ స్టైల్ భిన్నం అంటారు. ఆయన అలాంటి వారిని దగ్గరకు చేరనివ్వరని చెబుతారు. పార్టీలో విధేయులుగా ఉన్న సీనియర్లు అంటే లోకేష్ కి ప్రత్యేక అభిమానం అని అంటారు. ఇవన్నీ ఎందుకు అంటే లోకేష్ వ్యవహార శైలి మీద ఇపుడు టీడీపీలో తీవ్ర చర్చ సాగుతోంది.

లోకేష్ కీలక నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల మీద ఆయన మీడియా ముఖంగానే మాట్లాడేస్తున్నారు. సీఎం పదవిని జనసేనతో షేర్ చేసుకోవడం లేదు అని లోకేష్ చాలా క్లియర్ గా చెప్పారు అంటే దటీజ్ లోకేష్ అని టీడీపీ శ్రేణులు అంటున్నాయట.

ఎందుకంటే ఏపీలో ఎవరు సీఎం అన్నది జనాల్లో ఒక అయోమయం రాకూడదు అన్నది తమ్ముళ్ల భావనగా చెబుతున్నారు. సహజంగానే టీడీపీ పెద్ద పార్టీ. చంద్రబాబు ఫేస్ వాల్యూని చూసే టీడీపీకి ఓట్లు వేస్తారు. ఇపుడు లోకేష్ పాదయాత్ర సైతం దానికి ఎంతగానో దోహదపడింది.

దాంతో పాటు యువగళం ముగింపు సభ విజయవంతం కావడం కూడా టీడీపీ శ్రేణులకు ఎక్కడ లేని ధీమాను పెంచుతోంది. ఈ టైంలో మిత్ర పక్షాలతో సహా ఎవరికీ ఎటువంటి కొత్త ఆశలు పెంచకూడదని మొగ్గలోనే తుంచేయాలని ఒక ఆలోచన అయితే పసుపు దళంలో ఉంది. దానికి తగినట్లుగానే లోకేష్ మాట్లాడారు అని అంటున్నారు.

సీఎం అని పవన్ సభలలో జనసైనికులు మాట్లాడుతూంటే పవన్ ఎన్నికల తరువాత సీఎం సీటు గురించి మాట్లాడుకుంటామని చెబుతూ వచ్చారు. దాంతో చంద్రబాబు అయిదేళ్ల సీఎం కాదా అన్న డౌట్లు హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ లో ఉన్నాయి. దానికి లోకేష్ కరెక్ట్ సమాధానం ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి టీడీపీ తమ్ముళ్ళకు అందునా యువతరానికి లోకేష్ బాగా నచ్చేస్తున్నారుట. ఇలాగే ముక్కు సూటిగా క్లారిటీగా ఉండాలని వారు లోకేష్ గురించి అంటున్నారు.