Begin typing your search above and press return to search.

మంగళగిరిలో పోటీ మీద లోకేష్ సంచలన కామెంట్స్...!?

గత ఎన్నికల టైంలో చిన్న పొర్పాటు కారణంగా తాను ఓడిపోవాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:54 AM GMT
మంగళగిరిలో పోటీ మీద లోకేష్ సంచలన కామెంట్స్...!?
X

నారా లోకేష్ తెలుగుదేశం యువ నాయకుడు. చంద్రబాబు తరువాత పార్టీ పగ్గాలు మోయాల్సిన నేత. తనను తాను రుజువు చేసుకునేందుకు నారా లోకేష్ ఏకంగా మూడు వేల కిలోమీటర్ల పై దాటి నడిచారు. కుప్పంతో మొదలెట్టి విశాఖతో పాదయాత్ర ముగించారు లోకేష్.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారు అని తెలుసు. మరి ఇటీవల వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలు బీసీ అభ్యర్ధిగా గంజి చిరంజీవిని లోకేష్ మీద పోటీగా వైసీపీ పెట్టడానికి రెడీ అవుతున్న నేపధ్యంలో లోకేష్ మంగళగిరి పోటీ మీద పునరాలోచిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.

అదే విధంగా ఒకవేళ మంగళగిరిలో పోటీ చేసినా అయన వేరే నియోజకవర్గం కూదా చూసుకుని రెండవ సీటుగా అక్కడ నుంచి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక మీడియా సంస్థకు లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పోటీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాను అని లోకేష్ స్పష్టం చేశారు.

తాను గత అయిదేళ్ళుగా మంగళగిరి జనంతో కనెక్ట్ అయి ఉన్నాను అని ఆయన చెప్పారు. తనకు ఒక ఫోన్ చేసినా లేక మేసేజ్ పెట్టినా అక్కడ ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన పనులను చేసి పెడుతున్నట్లుగా వెల్లడించారు. మంగళగిరిలో చాలా కాలంగా టీడీపీ జెండా ఎగరలేదని అందుకే తాను ఒక సవాల్ గా తీసుకుని అక్కడ నుంచి పోటీ చేయలని భావించాను అని చెప్పారు.

గత ఎన్నికల టైంలో చిన్న పొర్పాటు కారణంగా తాను ఓడిపోవాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. తాను ఎన్నికలకు కేవలం 21 రోజులు ముందు మాత్రమే మంగళగిరిలో ప్రవేశించాను అని అన్నారు. తనకు ప్రజలతో మొత్తంగా కనెక్ట్ కావడానికి టైం సరిపోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈసారి మాత్రం అలా కాదని ఓడిన మరుక్షణం మంగళగిరిలో తాను అడుగు పెట్టాను అని మొత్తం అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యాయని ఆయన అంటున్నారు.

ఇక మంగళగిరిని టీడీపీకి కంచుకోటగా చేస్తానని లోకేష్ బిగ్ సౌండ్ చెస్తున్నారు. ఈ రోజున తాను ఏమిటి అన్నది ప్రజలకు తెలిసిందని, అలాగే ప్రజలు ఏమిటి అన్నది తనకు తెలిసింది అని లోకేష్ అన్నారు. తాను గత ఎన్నికల్లో అయిదు వేల ఓట్ల తేడాతో ఓడాను అని ఈసారి దాని పక్కన సున్నా పెట్టవచ్చు అని తన మెజారిటీ 53 వేలకు తగ్గదని లోకేష్ స్పష్టం చేయడం విశేషం.

అలా మంగళగిరి ప్రజలు తనను భారీ మెజారిటీతో ఆశీర్వదిస్తారు అని తాను ఆశిస్తున్నాను అని లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చూస్తే నారా లోకేష్ ని ఈసారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ చూస్తోంది. బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో అందుకే ఏరి కోరి బీసీకి టికెట్ ఇస్తోంది. మరి గంజి చిరంజీవి ఒకనాడు అంటే 2014లో మంగళగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కేవలం 12 ఓట్లతో ఓటమి పాలు అయ్యారు.

ఈసారి ఎలాగైనా గెలిచి చూపిస్తమని అంటున్నారు. బీసీల సీటు మంగళగిరి అని గంజి చిరంజీవి అంటున్నారు. టీడీపీకి కంచుకోట అని నారా లోకేష్ అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి మంగళగిరి ప్రజల దీవెనలు నిండుగా ఉంటాయన్నది మరి కొద్ది నెలలు ఆగితే తెలుస్తుదని అంటున్నారు.