Begin typing your search above and press return to search.

లోకేష్ ఎర్రబుక్ తెచ్చిన తంటా... కోర్టులో కీలక పరిణామం!

అవును... తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ పై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది

By:  Tupaki Desk   |   22 Dec 2023 12:50 PM GMT
లోకేష్ ఎర్రబుక్ తెచ్చిన తంటా... కోర్టులో కీలక పరిణామం!
X

నారా లోకేష్ ఎర్రబుక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. యువగళం పాదయాత్ర మొదలైనప్పటినుంచీ అది చేత్తో పట్టుకుని కనిపిస్తున్న లోకేష్... అందులో అధికారుల పేర్లు రాస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు అందులో పొందుపరుస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటున్నాడని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఈ సమయంలో ఆ ఎర్రబుక్ లోకేష్ ని బుక్ చేసినట్లు తెలుస్తుంది!

అవును... తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ పై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇందులో భాగంగా... టీడీపీ నేత నారా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ అందజేసిందని తెలుస్తుంది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని.. ఇందులో భాగంగా చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ పిటిషన్‌ లో పేర్కొంది.

కాగా.. యువగళం‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పనేలా వ్యాఖ్యానించడంతోపాటు.. ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించాలనే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ తన మెమోలో పేర్కొంది.

వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో గతంలోనే సీఐడీ లోకేష్‌ కు 41ఏ కింద నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో వాటిని లవ్ లెటర్లుగా ఆయన అభివర్ణించారు! ఈ క్రమంలో ఇప్పటికే లోకేష్ 2 సార్లు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో స్కిల్ స్కాం, ఐ.ఆర్.ఆర్., ఫైబర్ నెట్ స్కాం తదితర కేసులలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారు.

అయితే... అధికారులు 164 సీ.ఆర్‌.పీ.సీ. కింద ఇచ్చిన వాంగ్మూలంపైనా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపిస్తుంది. అసలు అధికారులు వాగ్మూలం ఎలా ఇస్తారని అంటూ రెడ్ బుక్‌ లో పేర్లు రికార్డు చేశానని, తమ‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్‌ హెచ్చరించారు. దీంతో... న్యాయ విచారణ ప్రక్రియలో భాగాన్ని సైతం‌ లోకేష్ తప్పుపడుతున్నారంటూ విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.

దీంతో లోకేష్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు రాగా... ఈ పిటిషన్ పై లోకేష్ తరుపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ అభ్యంతరాలను రాతపూర్వకంగా అందజేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు.