Begin typing your search above and press return to search.

ఆ వ్యాఖ్యలకు నెల బాధ పడ్డా.. ఓపెన్ అయిన భువనేశ్వరి!

తన భర్త ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో ప్రజా ఉచిత వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:23 AM GMT
ఆ వ్యాఖ్యలకు నెల బాధ పడ్డా.. ఓపెన్ అయిన భువనేశ్వరి!
X

ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలపై నెల రోజుల పాటు తాను బాధ పడినట్లుగా పేర్కొన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి. తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్రం వంద రూపాయిల స్మారక నాణెన్ని విడుదల చేయటం.. తన భర్త ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో ప్రజా ఉచిత వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆ సందర్భంలోనూ రాజకీయం గురించి పెద్దగా ప్రస్తావన తేని ఆమె.. ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన వేళ మాత్రం ఓపెన్ అయ్యారు.

వైసీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు చాలా బాధను కలిగించాయన్న ఆమె.. ''ఆ బాధ నుంచి బయటపడేందుకు నెల రోజులు పట్టింది. నా కుటుంబ సభ్యులంతా సపోర్టు చేవారు. ఇప్పుడు ఎవరెన్నన్నా లెక్క లేదు. ఒకసారి ఎదుర్కొన్నాం. ఈసారేమీ వెనుకాడేది లేదు. ఇక ఎవరేం మాట్లాడినా ఆ వ్యాఖ్యలు నన్ను ఇబ్బంది పెట్టవు'' అని వ్యాఖ్యానించారు.

కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబును ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పంపారని.. నియోజకవర్గ ప్రజల రునాన్ని తాము ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. కుప్పం ప్రజల మీద తాము చూపించే అభిమానానికి నిదర్శనమే తాజాగా ప్రారంభించిన సంజీవని క్లినిక్ గా పేర్కొన్నారు.

ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవల్ని అందిస్తామన్నారు. తనకెప్పుడూ కుప్పం మీదనే మనసు ఉంటుందని.. ప్రతి రెండు నెలలకు ఒకసారి వెళ్లి.. వాళ్లందరిని చూసి రావాలని తాను తన భర్త చంద్రబాబుకు చెబుతుంటానని పేర్కొన్నారు.

లోకేశ్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. ఒక తల్లిగా తనకు చాలా గర్వంగా ఉందన్న భువనేశ్వరి.. "ముందు పాదయాత్ర వద్దన్నాను. ఏమవుతుందోనన్న భయం వేసింది. కానీ.. లోకేశ్ మాత్రం పట్టుబట్టాడు. పార్టీ కంటే ప్రజలకు ఏదో చేయాలన్న తపన అతనికి ఉంది.

టీడీపీ క్యాడర్ చాలా అవస్థలు పడ్డారు. వాళ్ల కంటే లోకేశ్ చేసేది ఎక్కువ కాదు" అని వ్యాఖ్యానించారు. పాదయాత్ర కారణంగా తనకు ఎలాంటి సమస్య గురించి లోకేశ్ చెప్పలేదన్న భువనేశ్వరి.. తాను వెళ్లి అడిగితే బాగున్నట్లుగా చెబుతారన్నారు.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని.. అత్యధిక సీట్లు సాధిస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లి వద్ద తాము కట్టిస్తున్న ఇంటి నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. మరో ఆర్నెల్లలోపు కుప్పంకు వస్తామని.. సొంత ఇంటిని నిర్మించుకోవటం కారణంగా ప్రజలకు మరింత దగ్గరగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.