లోకేష్ పట్టాభిషేకం....టీడీపీలో మూడవ తరం
డీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేత అధినేత హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
By: Satya P | 29 April 2026 9:19 AM ISTతెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు రాబోతున్నాయి. పార్టీని ఇక మీదట ఆయన తన కనుసన్ననలో నడపబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన సర్వ సత్తాక అధినాయకుడు కాబోతున్నారు. చంద్రబాబు అధినేతగా ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ పూర్తి బాధ్యతలను నిర్వహిస్తారు అని అంటున్నారు. దాంతో లోకేష్ పార్టీ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ఈ నెల 29న బుధవారం జరుపుతున్నారు
ప్రమాణం చేయించనున్న బాబు :
టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేత అధినేత హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరగనుంది. లోకేష్ తో పాటు మొత్తం 252 మందితో కూడిన జాతీయ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం తాజాగా నియమించింది. ఇందులో కీలక నేతల ప్రమాణం అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనుంది అని అంటున్నారు. ఇక ఈ కమిటీలలో నేతల ఎంపిక అన్నది సామాజికవర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా జరిగింది అని చెబుతున్నారు. అంతే కాదు పార్టీలో సీనియర్లకు చోటు దక్కింది. అలాగే ఉత్సాహవంతులు అయిన జూనియర్లకు కొత్త వారికి కూడా సముచిత స్థానం లభించింది.
కీలక బాధ్యతలు :
నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు ఈ నెల 29 నుంచి చేపట్టనున్నారు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అన్నది లేదు. టీడీపీ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా సృష్టించిన ఈ పదవిలోకి లోకేష్ మొదటిసారి రాబోతున్నారు. ఇక లోకేష్ వయసు కంటే పెద్దది అయిన టీడీపీ బాధ్యతలను ఆయన మోయనుండడం మరో విశేషం. చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు అందేనాటికి ఆయన వయసు 45 ఏళ్ళు. దాదాపుగా టీడీపీ పగ్గాలు అన్నీ లోకేష్ వే అన్నట్లుగా అందుతున్న ఈ పదవిని బాబు కంటే చిన్న వయసులోనే లోకేష్ దక్కించుకుంటున్నారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి 14 ఏళ్ళ పాటు నడిపారు. ఆయన తరువాత చంద్రబాబు మూడు దశాబ్దాల పాటు టీడీపీని మొత్తం తన భుజాన వేసుకున్నారు ఇపుడు లోకేష్ పసుపు పార్టీ భారం తాను తీసుకుంటున్నారు.
మహానాడుతోనే మొదలు :
ఇక కేవలం నెల కంటే తక్కువ సమయం టీడీపీ మహానాడుకు ఉంది. లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక తొలి పార్టీ పండుగ అంది. అంతే కాదు అతి పెద్ద టీడీపీ వేడుక కూడా. దానిని లోకేష్ పూర్తిగా తన నాయకత్వ పటిమతో నిర్వహించనున్నారు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే ఏడాది జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వ్యూహాలు ఇలా మొత్తం పార్టీ వ్యవహారాలలో లోకేష్ ది అతి ముఖ్య పాత్ర అని అంటున్నారు. 2029 ఎన్నికలు కూడా లోకేష్ కి పెద్ద బాధ్యత కానున్నాయని అంటున్నారు. బాబు సలహా సూచనలతో పార్టీని లోకేష్ నడిపినా భారంలో సింహ భాగం ఆయనదే అని అంటున్నారు. మొత్తానికి పార్టీ పట్టాభిషేకం జరగనుంది. ఇక మిగిలింది ప్రభుత్వ పట్టాభిషేకమే అని అంటున్నారు.
