మంత్రి వర్గ విస్తరణ...క్లారిటీ వచ్చినట్లేనా ?
ఏపీలో రాజకీయం చకచకా మారుతోంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ తనదైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది.
By: Satya P | 17 April 2026 1:00 AM ISTఏపీలో రాజకీయం చకచకా మారుతోంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ తనదైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను టీడీపీ తీసుకుంది. ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలను పూర్తి చేసింది. లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అని గత మహానాడులోనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కానీ ఈసారి మహానాడుకు ముందుగానే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దాంతో ఒక విధంగా పార్టీ బాధ్యతలను లోకేష్ చేతిలో పెట్టినట్లు అయింది.
మహానాడు తరువాత :
దీంతో ఈసారి మహానాడుకు లోకేష్ కొత్త బాధ్యతలతో అడుగు పెడతారు అని అంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పాల్గొనే తొలి మీటింగ్ ఇదే కాబోతోంది. ఆ విధంగా టీడీపీ మీద పూర్తి పట్టుని సాధించేందుకు ఈ కీలక సమావేశం లోకేష్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇక మహానాడు తరువాత జూన్ నెలలో టీడీపీ కూటమి రెండేళ్ల పాలన పూర్తి అవుతుంది. దాంతో మంత్రి వర్గ విస్తరణ కూడా సరైన ముహూర్తం పెట్టుకుని చేస్తారు అని అంటున్నారు.
ఈ కూర్పుతోనే ఆ మార్పు :
పార్టీ పదవుల విషయంలో అనుసరించిన కూర్పుతోనే మంత్రి వర్గ విస్తరణలోనే మార్పులు చేస్తారు అని అంటున్నారు. ఎక్కువ మంది యువతకు పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. దాంతో ఇదే వరసలో ప్రభుత్వంలోనూ యువతకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పటికే కూటమి మంత్రులలో మెజారిటీ కొత్త వారే ఉన్నారు. అరడజన్ లోపే సీనియర్ మంత్రులు ఉన్నారు. కానీ ఈసారి చేసే మార్పులలో కొత్త వారు అంటే ప్రభుత్వం గురించి మరింత ధాటీగా జనంలోకి తీసుకుని వెళ్ళే వారిని తీసుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్లు జూనియర్లకు కూడా స్థాన చలనం ఉంటుందని అంటున్నారు.
కొత్త వారికే చాన్స్ :
టీడీపీ కమిటీలను చూసిన వారికి అయితే ఒక విషయం అర్ధం అయిపోయింది. పార్టీ పదవులు అయినా మంత్రి పదవులు అయినా కొత్త వారికే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. టీడీపీ మీద తనదైన ముద్రను బలంగా వేసిన లోకేష్ ప్రభుత్వంలో మార్పులు జరిగితే అక్కడా తన మార్క్ చూపిస్తారు అని అంటున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ భారీ స్థాయిలో ఉంటుందా లేదా మూడు నాలుగు పదవులతో భర్తీ చేసి అక్కడితో ముగిస్తారా అన్నది అయితే తేలాల్సి ఉంది. ఒక్కటి మాత్రం వాస్తవం అంటున్నారు. గతంలో జగన్ చేసినట్లుగా మొత్తానికి మొత్తం మంత్రులను మార్చేసి కొత్త వారిని తీసుకోవడం జరగదని కొద్ది మందినే మార్చి అనుకున్న విధంగా మంత్రి వర్గం కసరత్తుని ముగిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ కమిటీల ప్రకటన తర్వాత అందరి చూపు మంత్రి వర్గ విస్తరణ మీదనే ఉంది. మరి ఆ ముహూర్తం ఎపుడు ఏమిటి అన్నదే వేచి చూడాల్సి ఉంది.
