Begin typing your search above and press return to search.

ప్రధాని మూడు సలహాలిచ్చారు.. లోకేశ్

ప్రధాని మోదీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరవలేనివాని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 11:38 AM IST
ప్రధాని మూడు సలహాలిచ్చారు.. లోకేశ్
X

ప్రధాని మోదీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరవలేనివాని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత నెల 17న ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రధాని ఆహ్వానం మేరకు లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానితో సుమారు రెండు గంటలు వివిధ అంశాలపై చర్చించినట్లు లోకేశ్ తాజాగా వెల్లడించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్.. గత నెలలో ప్రధానిని కలిసిన విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఏడాదిగా ప్రధానితో తన సంబంధాలను పూర్తిగా వివరించారు.

గత నెలలో ప్రధానితో భేటీ కావడం మరపురానిదని లోకేష్ చెప్పారు. బీజేపీతో ఎన్నికల అవగాహన కుదరిన తర్వాత ఆయనతో కలిసి రెండు సభల్లో పాల్గొన్నానని, రాజమండ్రి సభలో కూటమి ఎన్నిసీట్లు గెలుచుకుంటుందని తనను అడిగినట్లు లోకేష్ వెల్లడించారు. మూడు పార్టీలు కలిసి పనిచేస్తే 22 సీట్లు గెలుచుకుంటామని తాను చెబితే అన్ని వస్తాయా? అంటూ అప్పుడు ప్రధాని మోడీ ఆశ్చర్యపోయారని చెప్పారు. ప్రమాణ స్వీకార సభలో కూటమికి 21 సీట్లు వచ్చాయని తాను గుర్తు చేస్తే బాగా పనిచేశారంటూ అభినందించారని లోకేష్ గుర్తు చేసుకున్నారు.

అప్పుడే ఢిల్లీ వచ్చి తనను కలవాలని ఆహ్వానించారని, కానీ, ఆయనకు కలిసేంత సమయం ఉండదని తాను వెళ్లలేదని చెప్పారు. అయితే ప్రధాని విశాఖ వచ్చినప్పుడు మీ అబ్బాయి ఢిల్లీ రమ్మంటే రావడం లేదని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని, మళ్లీ అమరావతిలో రాజధాని పనుల పునఃప్రారంభోత్సవ సభలో నువ్వు ఢిల్లీ రానందుకు శిక్షిస్తానని వీపుపై రెండు దెబ్బలు వేసినట్లు చెప్పారు. ఇక తప్పదని గత నెలలో ఆయన అపాయింట్‌మెంట్ తీసుకున్నానని లోకేష్ తెలిపారు. గత 25 ఏళ్లుగా గుజరాత్ సీఎం, దేశానికి ప్రధానిగా పనిచేస్తున్న మోడీ వెనుక ఉన్న శక్తి ఏంటి? ఆయనకు అంత ఉత్సాహం ఎలా వచ్చిందన్న ఆసక్తితోనే ఆయనను కలిశానని వివరించారు లోకేష్.

ప్రధానితో భేటీ అయిన రెండు గంటల్లో తొలి గంట పూర్తిగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది పూర్తిగా తెలుసుకున్నారని చెప్పారు. ఈ భేటీలో ప్రధాని తనకు మూడు విలువైన సూచనలిచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు. ‘‘నా ఆలోచనలు స్పీడుగా ఉంటాయి. అదే సమయంలో తప్పులు కూడా జరుగుతాయని, తనను గైడ్ చేయాలని’’ ప్రధానిని కోరినట్లు చెప్పారు. పని చేసే వారే తప్పులు చేస్తారని, ఇంట్లో పడుకుంటే చేయం కదా, మనం నిజాయితీగా పనిచేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మోదీ మొదటి సలహాగా చెప్పారు.

నువ్వు ఎదిగేందుకు మీ నాన్న ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. వాటిని ఉపయోగించుకుని స్వతంత్రంగా నాయకుడిగా ఎదగాలని రెండో సలహా ఇచ్చారు. ఇక దేశ శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించి నిరంతరం కష్టపడాలని చివరిగా సూచించారు. ఆయనతో సమావేశం ఇలా జరగడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సమావేశం నుంచి వచ్చాక తెల్లవారు జామున నాలుగింటి వరకూ నిద్రపట్టలేదు అని లోకేశ తెలిపారు. ప్రధాని అంత సమయం ఇచ్చి చెప్పిన విషయాలను సీరియస్ గా తీసుకోవాలనుకున్నానని చెప్పారు.