Begin typing your search above and press return to search.

మహానాడుకు కౌంట్ డౌన్...లోకేష్ ముందస్తు ప్రిపరేషన్

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడుని నిర్వహిస్తుంది. అది క్రమం తప్పకుండా ప్రతీ ఏడూ జరపడం పార్టీలో ఒక ఆనవాయితీ.

By:  Satya P   |   24 May 2026 11:00 AM IST
మహానాడుకు కౌంట్ డౌన్...లోకేష్ ముందస్తు ప్రిపరేషన్
X

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడుని నిర్వహిస్తుంది. అది క్రమం తప్పకుండా ప్రతీ ఏడూ జరపడం పార్టీలో ఒక ఆనవాయితీ. మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీలో అతి పెద్ద పండుగగా చేపడతారు. గతంలో మూడు రోజుల పాటు జరిపేవారు. తరువాత కాలంలో రెండు రోజులకు కుదించారు. ఎన్ని రోజులు చేసినా క్యాడర్ మాత్రం ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉంటుంది. ఈసారి మహానాడు వెరీ స్పెషల్ అని అంతా అనుకున్నారు. దానికి కారణం లోకేష్ ఈసారి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. దాంతో ఆయన ప్రత్యక్ష ప్రసంగాన్ని వినాలని క్యాడర్ అంతా ఎంతగానో ఎదురుచూసింది. అయితే పశ్చిమాసియాలో ఘర్షణల ప్రభావం మహానాడుని తాకింది. వీలైనంతలో పొదుపు చర్యలు పాటించాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు మహానాడుని ఈసారి వర్చువల్ విధానంలో చేపడుతున్నారు.

రంగంలోకి దిగిన లోకేష్ :

మహానాడు మరో మూడు రోజులలో మొదలు కాబోతోంది. వర్చువల్ గా కావడంతో ఏర్పాట్ల గురించి అంత హడావుడి అవసరం లేకపోయినప్పటికీ క్యాడర్ ని సన్నధం చేసేందుకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఆయన పార్టీలోని క్లస్టర్ స్థాయి ఇంచార్జిలతో తాజాగా ఆన్ లైన్ ద్వారా కీలక భేటీని నిర్వహించారు. మహానాడు ఎలా నిర్వహించాలి క్యాడర్ ఆలోచనలు వారి పార్టిసిపేషన్ వంటి వాటి మీద ఆయన చర్చించారు. మొత్తం 1874 క్లస్టర్లకు చెందిన ఇంచార్జిలలతో లోకేష్ సమావేశం జరపడం విశేషం. ప్రతీ ఒక్క క్లస్టర్ ఇంచార్జి మహానాడుని సక్సెస్ ఫుల్ గా జరిపించేలా చూడాలని లోకేష్ పిలుపు ఇచ్చారు. మహానాడు ఈ నెల 27, 28 తేదీలలో జరుగుతోందని ఆయన తెలిపారు. అందుకు అంతా సిద్ధంగా ఉండాలని తగిన విధంగా క్లస్టర్ స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

టీడీపీకి గొప్ప స్పూర్తి :

మహానాడు అన్నది ప్రతీ ఏటా చేసుకుంటున్నా అది కేవలం పార్టీ సంస్థాగత కార్యక్రమం కాదని అది ఒక అద్భుతమైన వేడుగ పండుగ అని లోకేష్ చెప్పారు. అంతే కాదు స్పూర్తివంతమైన కార్యక్రమం అని కూడా లోకేష్ తెలిపారు. తెలుగు దేశం పార్టీ అంటేనే త్యాగానికి క్రమశిక్షణకు సంస్థాగత బలానికి ఒక అతి పెద్ద నిదర్శనం అని కూడా లోకేష్ చెప్పరు. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీగా ఆయన అభివర్ణించారు. తెలుగు ప్రజల జీవితాలలో సరికొత్త వెలుగులు నింపుతూ టీడీపీ నాలుగున్నర దశాబ్దాల పాటు కొనసాగుతోందని అన్నారు. గతంలో కరోనా సమయంలో ఒకసారి మహానాడు జనం మధ్యన బహిరంగంగా నిర్వహించలేకపోయామని ఆయన గుర్తు చేశారు. అయినా వర్చువల్ గా నిర్వహించామని, ఆ స్పూర్తి మాత్రం అందరికీ ఎంతగానో లభించింది అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా మహానాడుని పూర్తిగా విజయవంతం చేయాలని లోకేష్ కోరారు.

తీర్మానాలు రెడీ :

ఇదిలా ఉంటే ఇప్పటికే మహానాడుకు సంబంధించిన తీర్మానాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. తీర్మానాల కమిటీ చైర్మన్ హోదాలో యనమల రామక్రిష్ణుడు ఆయనతో పాటు నియమించిన బృందం అంతా తీర్మానాలను రూపకల్పన చేశారు అని అంటున్నారు. దాంతో మహానాడులో ఏ తీర్మానాలు రాబోతున్నాయన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది.