నీ కోవా బన్ తినాలని ఉంది.. వలీకి అండగా లోకేష్
వ్యూస్ కోసం ఒక చిరు వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన యూట్యూబర్ల తీరుపై నెటిజన్లు భగ్గుమంటున్న వేళ ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై అత్యంత మానవీయంగా స్పందించారు.
By: A.N.Kumar | 15 Feb 2026 4:38 PM ISTమేడారం జాతర వేదికగా మొదలైన "కోవా బన్" వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. వ్యూస్ కోసం ఒక చిరు వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన యూట్యూబర్ల తీరుపై నెటిజన్లు భగ్గుమంటున్న వేళ ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై అత్యంత మానవీయంగా స్పందించారు. బాధిత వ్యాపారి వలీకి అండగా నిలుస్తూ లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్నూలుకు చెందిన చిరు వ్యాపారి షేక్ షావలి పట్ల జరిగిన అవమానంపై నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. "ప్రియమైన సోదరుడు వలీ.. మీరు ఎదుర్కొన్న ఈ పరిస్థితి నన్ను ఎంతగానో కలచివేసింది. మన తెలుగు సమాజం ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావానికి ప్రతీక. ఇలాంటి విభజన రాజకీయాలకు, మతపరమైన వేధింపులకు ఇక్కడ చోటు లేదు. నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. మీరు తయారు చేసే ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురుచూస్తున్నాను." అని నారా లోకేష్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ సంచలనమైంది. అందరినీ కదిలించేలా ఉంది.
అసలేం జరిగింది? వివాదం నేపథ్యమిదీ..
మేడారం జాతరలో కర్నూలు జిల్లాకు చెందిన వలీ, కేవలం 10 రూపాయలకే కోవా బన్ విక్రయిస్తూ తన జీవనోపాధి సాగిస్తున్నాడు. అయితే కొందరు యూట్యూబర్లు అతని స్టాల్ వద్దకు వెళ్లి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మతం రంగు పులుముతూ ప్రశ్నలతో వేధించారు. ఇంగ్లీషులో మాట్లాడుతూ భయపెట్టడం, ఆధార్ కార్డు అడగడం, ఎక్స్‌పైరీ డేట్ గురించి నిలదీయడం వంటి చర్యలతో వలీని ఇబ్బంది పెట్టారు. తాను ఎంతో కష్టపడి స్వచ్ఛమైన కోవా బన్ తయారు చేస్తున్నానని, తక్కువ లాభానికే పేదలకు అమ్ముతున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సమయంలో చుట్టుముట్టిన కొందరు వలీ బండిని, సరుకును కూడా ధ్వంసం చేయడంతో దాదాపు రూ. 1 లక్ష నష్టం వాటిల్లింది.
రాజకీయ పక్షాల సంఘీభావం
లోకేష్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా వలీకి మద్దతు ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ "ఆకలికి కులం ఉండదు.. ఆత్మగౌరవానికి మతం ఉండదు" అంటూ కష్టపడి పనిచేసే వ్యక్తిని వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా వలీకి అండగా నిలుస్తూ, చిరు వ్యాపారుల పట్ల గౌరవం ఉండాలని పిలుపునిచ్చారు.
నెటిజన్ల పోరాటం.. మానవత్వానికి పట్టాభిషేకం
యూట్యూబర్లు వ్యూస్ కోసం ఒక సామాన్యుడి జీవితాన్ని రోడ్డున పడేయడంపై సోషల్ మీడియాలో యుద్ధం నడిచింది. "నిజాయితీగా బతికే వలీని వేధించడం తగదు" అని వేలాది మంది పోస్టులు పెట్టారు. ఈ ప్రజా మద్దతు ఫలితంగానే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.
మేడారం కోవా బన్ ఘటన డిజిటల్ మీడియా బాధ్యతపై కొత్త చర్చను రేకెత్తించింది. ఒక చిన్న వ్యాపారికి అండగా రాష్ట్ర కేబినెట్ మంత్రి నిలవడం, సామాజిక ఐక్యతకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే వలీని కలిసి, అతను తయారు చేసే కోవా బన్‌ను లోకేష్ రుచి చూస్తారని సమాచారం.
