లోకేష్ ఢిల్లీ ఫోకస్...ఈసారి బిజీగానే
తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ ని ముగించుకుని వచ్చిన ఒక రోజు తేడాలో లోకేష్ హస్తిన పర్యటన పెట్టుకోవడం విశేషం.
By: Tupaki Desk | 4 Feb 2025 2:30 AM GMTతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు. తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ ని ముగించుకుని వచ్చిన ఒక రోజు తేడాలో లోకేష్ హస్తిన పర్యటన పెట్టుకోవడం విశేషం. లోకేష్ ఈ తడవ ఢిల్లీ టూర్ పూర్తి అధికారికంగానూ అలాగే బిజీ షెడ్యూల్ గానూ డిజైన్ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరస భేటీలు అవుతారు. అదే విధంగా ఆయన ఏపీకి పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు కేటాయించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో భేటీ అయి ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తారు. అంతే కాకుండా రాష్ట్రానికి కావాల్సిన మరిన్ని కొత్త ప్రాజెక్టుల గురించి కూడా చర్చిస్తారు.
ఇక వరసబెట్టి కీలక శాఖలు చూస్తున్న పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీలు వేయనున్నారు. ఏపీకి వివిధ రంగాలలో రావాల్సిన నిధుల గురించి వారితో చర్చించి సానుకూలం చేసుకుని వస్తారని అంటున్నారు. రాష్ట్రానికి ఏ ఏ రంగాల నుంచి మంత్రిత్వ శాఖల నుంచి నిధులు రావాలన్నది చూసుకుని మరీ ఆయన మంత్రుల వద్ద విన్నపాలు చేయడమే కాకుండా వీలైతే ఒత్తిడి పెంచి మరీ ఏపీకి దండీగా నిధులు తెచ్చే అతి పెద్ద బాధ్యతను భుజాన వేసుకుని లోకేష్ ఢిల్లీ పర్యటన చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే బడ్జెట్ కి ముందూ తరువాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అదే విధంగా ఆయన విభజన ఏపీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందని ఉదారంగా ఆదుకోవాలని కోరుతూ వచ్చారు. ఇపుడు లోకేష్ ఆ బాధ్యతలను తాను తీసుకుని దానికి కొనసాగిస్తూ ఢిల్లీలో తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతలా చంద్రబాబు లోకేష్ ఢిల్లీ పర్యటనలు చేయడం వెనక చాలా విషయాలు ఉన్నాయి. ఏపీలో ఖజానా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిధులు అయితే పెద్దగా లేవు. దాంతో అప్పుల కోసం చూడాల్సి వస్తోంది. ఎన్నో హామీలు కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాటిని నెరవేర్చాలీ అంటే కూడా ఎంతో కొంత నిధులు కావాలి. అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామని కూటమి ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు.
అయితే దానికి ఏపీ ఖజానా సహకరించడంలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు కలుకుంటూ చేసే అభివృద్ధి పనులు ఎక్కువగా ఉంటాయి. అలాగే నేరుగా కేంద్రం నిధులతో రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నడిపించే ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. మరి కొన్ని అయితే ఉదారంగా కేంద్రం ఆయా రాష్ట్రాల పట్ల చూపించే అభిమానంతో కూడా నిధులు వస్తూంటాయి.
ఎటూ కేంద్రంతో పొత్తు ఉంది. దాంతో పాటు మంచి రిలేషన్స్ కొనసాగిస్తున్న క్రమలో చంద్రబాబు లోకేష్ పూర్తి స్థాయిలో కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఏపీలో అభివృద్ధికి అలాగే ఎంతో కొంత నిధుల విషయంలో వెసులుబాటుకు తమదైన శైలిలో ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే ఢిల్లీ టూర్ లో లోకేష్ నిధులను భారీగా తెచ్చినట్లు అయితే ఆయన ఇమేజ్ కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. మొత్తానికి లోకేష్ టూర్ ఆసక్తిని రేపుతోంది అని అంటున్నారు.