పక్కా లోకల్.. సౌండ్ చేయని లోకేశ్
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోలాహలం నెలకొంది. దాదాపు ప్రతి పార్టీల్లోనూ ఒకటే హడావుడి కనిపిస్తోంది.
By: Tupaki Desk | 19 Oct 2026 7:00 PM ISTరాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోలాహలం నెలకొంది. దాదాపు ప్రతి పార్టీల్లోనూ ఒకటే హడావుడి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ తోపాటు రాష్ట్రంలో ఇతర నేతలు అంతా రాజకీయ వ్యూహరచనలో మునిగి తేలుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో ఆయా నేతల ప్రమేయంపై మీడియాలోనూ చర్చలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మంత్రి లోకేశ్ పాత్ర మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల హంగామా మొదలైన నుంచి మంత్రి లోకేశ్ పేరు ఎక్కడా వినిపించడం లేదు. అసలు ఆయనకు స్థానిక రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై దాదాపు వారం కావస్తోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియగా, 21వ తేదీ నుంచి జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇలాంటి కీలక సమయంలో అధికార కూటమితోపాటు విపక్షంలోనూ రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా కూటమిలో సీట్ల సర్దుబాటుతోపాటు అభ్యర్థుల ఎంపిక, తిరుగుబాటుదారులను బుజ్జగించే ప్రయత్నాలతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కొన్నిసార్లు స్థానిక సర్దుబాట్లు కొలిక్కి రాక అధినేతలు చంద్రబాబు, పవన్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇలాంటి కీలక ఎన్నికల్లో మంత్రి లోకేశ్ పాత్రపై ఎలాంటి ప్రస్తావన రాకపోవడమే రాజకీయంగా ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.
కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్న మంత్రి లోకేశ్ మున్సిపల్ ఎన్నికల చర్చల్లో ఎక్కడా కనిపించకపోవడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ కు ముందు సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిగినా లోకేశ్ ఏ విషయంలో జోక్యం చేసుకోలేదు. పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడును సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించి, మిత్రపక్షాలతో సంప్రదింపుల బాధ్యతను అప్పగించారు. ఇదే సమయంలో పల్లా, నిమ్మల స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని సర్దుబాటును కొలిక్కి తెచ్చారు.
పార్టీలో కీలక నేతగా ఉన్న లోకేశ్ మాత్రం స్థానిక ఎన్నికల వ్యవహారానికి పూర్తిగా దూరంగా ఉండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్టీ బాధ్యతలు అన్నీ తన భుజాన వేసుకున్న మంత్రి లోకేశ్.. కీలకమైన ఎన్నికల ప్రక్రియలో అసలు తలదూర్చకపోవడానికి కారణాలు ఏంటి? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. అయితే లోకేశ్ జోక్యం చేసుకోకపోవడానికి ఆయన గతంలో చేసిన ఒక ప్రకటన కారణమై ఉండొచ్చునని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కూటమి సర్దుబాట్లపై తొందరపాటుతో చేసిన ప్రకటన వల్ల జనసేన, బీజేపీ నాయకులు అంతర్గతంగా తీవ్ర ఇబ్బంది పడ్డారని ఈ కారణం వల్లే ఆయన అనవసర చర్చలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఆలోచనతో స్థానిక ఎన్నికల విషయంలో అసలు జోక్యం చేసుకోలేదని అంటున్నారు. అటు పార్టీలోనూ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక నేతలకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల లోకేశ్ పెద్దగా తలదూర్చాల్సిన అవసరం లేకుండా పోయిందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కీలక ఎన్నికల సమయంలో మంత్రి లోకేశ్ చర్చ లేకుండా రాజకీయాలు సాగుతుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.
