లోకేశ్ పై ట్రోలింగ్.. ఎందుకంటే..?
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ ఎఫెక్టుతో ఇన్నాళ్లు లోకేశ్ పై విమర్శల జోలికి వెళ్లకపోయినా, ఇప్పుడు ఓ వీడియోతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 12 Jun 2025 9:00 PM ISTరాష్ట్రమంత్రి, టీడీపీ యువనేత లోకేశ్ పై ట్రోలర్లు ప్రతాపం చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ ఎఫెక్టుతో ఇన్నాళ్లు లోకేశ్ పై విమర్శల జోలికి వెళ్లకపోయినా, ఇప్పుడు ఓ వీడియోతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా లోకేశ్ రాజకీయ ప్రత్యర్థులు ఓ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం వన్ ఇయర్ విజయోత్సవాల్లో కూటమి పార్టీలు, కార్యకర్తలు బిజీగా ఉండటంతో ట్రోలర్లకు కౌంటర్ కూడా ఎక్కడా కనిపించడం లేదు.
‘‘అందరికీ అమ్మ ఒడి ఇస్తానన్నాడు. ఏకంగా టాయిలెట్ మెంటినెన్స్ అని ఇతర మెంటినెన్స్ అంటూ అమ్మఒడి నుంచి లాగేస్తున్నాడు ఈ సైకో జగన్’’ అన్న లోకేశ్ వ్యాఖ్యలతో వీడియోను ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న వీడియోపై పెద్ద చర్చే జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి కోతలపై ఎక్కువగా విమర్శలు ఎక్కుపెట్టేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అనూహ్యంగా గత ప్రభుత్వం మాదిరిగానే తల్లికి వందనంలో రూ.2 వేలు కోత పెట్టింది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లుగానే మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి, పాఠశాలలకు మరో రూ.వెయ్యి చొప్పున కేటాయిస్తామంటోంది.
దీంతో ట్రోలర్లు లోకేశ్ పాత వీడియోలను బయటకు తీశారు. అప్పుడు కోతలు లేకుండా ఇస్తామని చెప్పి, ఇప్పుడు కోతలు విధిస్తున్నారని విమర్శలు గుప్పిస్తూ పాత వీడియోలను వైరల్ చేస్తున్నారు. వైసీపీ కూడా తమపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చెబుతారంటూ ప్రశ్నిస్తోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత లోకేశ్ పై ట్రోలింగు జరుగుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
