Begin typing your search above and press return to search.

‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026’ జాబితాలో నారా బ్రాహ్మణి.. చంద్రబాబు, లోకేష్, బాలయ్య హర్షం

ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫార్చ్యూన్ ఇండియా' తాజాగా విడుదల చేసిన '100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026' జాబితాలో ఆమె స్థానం సంపాదించారు.

By:  A.N.Kumar   |   11 July 2026 3:33 PM IST
‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026’ జాబితాలో నారా బ్రాహ్మణి..  చంద్రబాబు, లోకేష్, బాలయ్య హర్షం
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, ప్రముఖ డైరీ రంగ సంస్థ ‘హెరిటేజ్ ఫుడ్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫార్చ్యూన్ ఇండియా' తాజాగా విడుదల చేసిన '100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026' జాబితాలో ఆమె స్థానం సంపాదించారు.

దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక రంగానికి మహిళా పారిశ్రామికవేత్తలు అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ఈ జాబితాను ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది.

ఢిల్లీలో అవార్డు ప్రదానం.. రైతులకు అంకితం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన ఈ విజయ ప్రయాణంలో రైతుల పాత్రే అత్యంత కీలకమైనదని కొనియాడారు. "రైతుల నిరంతర కృషి, అంకితభావం వల్లే హెరిటేజ్ ఫుడ్స్ ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది. రైతు లబ్ధిదారుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవనోపాధిని మరింత మెరుగుపరచడమే మా సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. నాకు దక్కిన ఈ అరుదైన గౌరవాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబ సభ్యులతో పాటు, మాతో కలిసి నడుస్తున్న లక్షలాది మంది రైతులకు అంకితం చేస్తున్నాను" అని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు.

చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి అభినందనల జల్లు

నారా బ్రాహ్మణి సాధించిన ఈ అద్భుత ఘనతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ "ఈ గుర్తింపు బ్రాహ్మణి నాయకత్వ లక్షణాలు, అంకితభావం, దూరదృష్టి మరియు నిబద్ధతకు నిదర్శనం. భవిష్యత్తులో ఆమె మరిన్ని మైలురాళ్లను అధిరోహించాలి. ముఖ్యంగా తెలుగు యువతకు, మహిళలకు బ్రాహ్మణి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు" అని ఆకాంక్షించారు.

మంత్రి నారా లోకేష్ తన భార్య సాధించిన విజయానికి గర్విస్తూ ఎక్స్ వేదికగా ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా బ్రాహ్మణి గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణమని, ఆమె సమర్థ నాయకత్వంలో సంస్థ మరిన్ని ఉన్నత శిఖరాలను తాకాలని ఆకాంక్షించారు.

నారా భువనేశ్వరి కూడా స్పందించారు. బ్రాహ్మణికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ అరుదైన గౌరవం ఆమె దృఢ సంకల్పానికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి దక్కిన ప్రతిఫలమని ప్రశంసించారు.

- బాలయ్య పుత్రికోత్సాహం

ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న నారా బ్రాహ్మణికి ప్రముఖ నటుడు, బ్రాహ్మణి తండ్రి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. కష్టపడి సాధించిన విజయానికి గుర్తింపుగా లభించిన ఈ గౌరవం ఆమె అంకితభావం, పట్టుదల, నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని పేర్కొన్నారు.తన కృషితో సమాజంపై సానుకూల ప్రభావం చూపుతూ, యువతులు పెద్ద కలలు కనేందుకు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు బ్రాహ్మణి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ తన ఆశీస్సులు, శుభాకాంక్షలు ఎల్లప్పుడూ ఉంటాయని బాలకృష్ణ తెలిపారు.

హెరిటేజ్ ఫుడ్స్ ప్రగతిలో కీలక పాత్ర

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను ఆధునిక వ్యాపార విధానాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్లడంలో నారా బ్రాహ్మణి కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం వ్యాపార విస్తరణే కాకుండా.. రైతు సంక్షేమం, నాణ్యమైన పాల ఉత్పత్తుల సరఫరా, స్థిరమైన వ్యవసాయాభివృద్ధి పై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సంస్థ దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

ఫార్చ్యూన్ ఇండియా 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2026' జాబితాలో నారా బ్రాహ్మణి నిలవడం కేవలం ఒక సంస్థకు దక్కిన గౌరవం మాత్రమే కాదు, భారతీయ వ్యాపార రంగంలో మహిళా శక్తి మరింత బలపడుతోందనడానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విజయం నవతరం మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రేరణనిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.