Begin typing your search above and press return to search.

సౌమ్య అంటే సాఫ్ట్ అనుకున్నారా? పవరూ.. టీడీపీ అధిష్టానానికే ఝలక్!

సౌమ్య అంటే సాఫ్ట్ అనుకుంటున్నారా? పొలికల్ హాట్ అంటూ తన పవర్ చూపించారు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.

By:  Tupaki Desk   |   5 Feb 2025 1:18 PM GMT
సౌమ్య అంటే సాఫ్ట్ అనుకున్నారా? పవరూ.. టీడీపీ అధిష్టానానికే ఝలక్!
X

సౌమ్య అంటే సాఫ్ట్ అనుకుంటున్నారా? పొలికల్ హాట్ అంటూ తన పవర్ చూపించారు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. దళిత మహిళ ప్రజాప్రతినిధిగా తనను తక్కువ అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లేనని నిరూపించారు. ఎమ్మెల్యేగా తన రాజకీయ అనుభవం ఉపయోగించి.. నియోజకవర్గంలో తన పట్టు ఎలాంటిదో పార్టీ పెద్దలకు చూపించారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న రాజకీయం ఎమ్మెల్యే సౌమ్యలో పరిణతిని, పట్టదలను ప్రతిబింబించిందని టాక్ వినిపిస్తోంది.

నందిగామ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నిక సోమవారమే జరగాల్సివుంది. అయితే చైర్ పర్సన్ ఎంపిక విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు. చైర్ పర్సన్ గా తాను సూచించిన వారికి అవకాశం ఇవ్వాలని సౌమ్య, తన అనుచరులకు ఇవ్వాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పట్టుబట్టడంతో అధిష్టానం జోక్యం చేసుకోవాల్సివచ్చింది.

విజయవాడ ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో తన పెత్తనం ఉండాలని ఎంపీ శివనాథ్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనతో విభేదిస్తున్నారు. ఇందులో ప్రధానంగా నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సౌమ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజాప్రతినిధిగా తనను చిన్నచూపు చూడటాన్ని ఆమె సహించలేకపోతున్నారు. దీంతో ఎంపీతో నేరుగా యుద్ధానికి దిగారు. గత ప్రభుత్వంలోనే ఇసుక మాఫియాతో తలపడిన లేడీ సివంగిగా ఆమెకు పేరుంది. ఇక ఇప్పుడు అధికారం చేతిలో ఉండటంతో తగ్గేదేలే అన్నట్లు ఎంపీతో ఢీ అంటే ఢీ అన్నట్లు కొట్లాడి తన మాట నెగ్గించుకున్నారు.

నందిగామ మున్సిపల్ చైర్మన్ గా తాను సూచించిన వ్యక్తికి పదవి రాకపోయినా, ఎంపీ శివనాథ్ చెప్పిన వారికి కూడా పదవి వెళ్లకుండా అడ్డుకోవడం సౌమ్య రాజకీయానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎంపీ చెప్పిన వారికి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎంత ఒత్తిడి తెచ్చినా సౌమ్య వెనక్కి తగ్గకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నారాయణ, సత్యకుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వంటివారు రంగంలోకి దిగి సౌమ్యను నచ్చజెప్పాలని చూసినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీ శివనాథ్ మాట చెల్లుబాటు కాకూడదని భీష్మించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిని నిలబెడతానని హెచ్చరించారు. దీంతో అధిష్టానమే దిగిరావాల్సివచ్చింది. సౌమ్య చెప్పిన వారికి కాకపోయినా, ఎంపీ సూచించిన వారికి కాకుండా మధ్యే మార్గంగా మండవ క్రిష్ణకుమారి అనే కౌన్సిలరును చైర్మన్ చేస్తూ పార్టీ బి.ఫాం పంపింది. ఎంపీ సూచించిన శాఖమూరి ప్వర్ణలతకు పదవి దక్కకపోవడం తన విజయంగా భావించిన సౌమ్య వెనక్కి తగ్గడంతో నందిగామ కథ సుఖాంతమైంది.