Begin typing your search above and press return to search.

అసలు విలన్‌ పురందేశ్వరే: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!

కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్రం బాధ్యతలు అప్పగించింది

By:  Tupaki Desk   |   28 Aug 2023 10:13 AM GMT
అసలు విలన్‌ పురందేశ్వరే: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!
X

విఖ్యాత నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 ప్రత్యేక నాణెంను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో ఆగస్టు 28న ఈ ప్రత్యేక నాణెంను ఆవిష్కరించారు.

కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్రం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, మనుమళ్లు, మనవరాళ్లు ఇలా అందరికీ ఆహ్వానాలు పంపారు. అలాగే ఎన్టీఆర్‌ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన నేతలను కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులంతా నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే.. ఎన్టీఆర్‌ రెండో భార్య నందమూరి లక్ష్మీపార్వతికి మాత్రం ఆహ్వానం అందలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు పురందేశ్వరి కానీ ఆమెను ఆహ్వానించలేదు. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్‌ తిరుపతిలో అధికారికంగా వివాహం చేసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటికీ ఆమె ఎన్టీఆర్‌ భార్యే. అయినప్పటికీ అటు కేంద్రం కానీ, ఇటు పురందేశ్వరి కానీ లక్ష్మీపార్వతిని ఆహ్వానించలేదు.

ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కార్యక్రమానికి పిలవకపోవడంపై ఇదివరకే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రికి సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయినా స్పందన రాలేదు. దీంతో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లక్ష్మీపార్వతి తాజాగా ఒక లేఖ విడుదల చేశారు.

ఈ క్రమంలో దగ్గుబాటి పురందేశ్వరిపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. అసలు విలన్‌ ఆమేనంటూ ఫైరయ్యారు. ఇక నుంచి తన పోరాటం ఆమెపైనేనని తెలిపారు. ఎన్టీఆర్‌ కి అర్ధాంగిగా ఉన్న తనను ఆహ్వానించకపోవడం దుర్మార్గమన్నారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు కుటుంబ సభ్యులగా చెలామణీ అవుతారా? అని నిలదీశారు. పురంధేశ్వరి ఎంతో దుర్మార్గురాలని మండిపడ్డారు. తన వల్ల వారికి జరిగిన నష్టం ఏమిటి అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కొడుకులు అమాయకులు. కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.

పురందేశ్వరి చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తోందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. పురందేశ్వరి తిరిగిన ప్రతీ నియోజకవర్గంలో తాను తిరుగుతానన్నారు. ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం చేస్తానని హెచ్చరించారు. వీళ్ళ గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానన్నారు. ఎన్టీఆర్‌ కష్టాల్లో ఉంటే పురందేశ్వరి వచ్చిందా..? అని ప్రశ్నించారు. తననెందుకు చులకన చేస్తున్నారని నిలదీశారు. తనను చులకన చేస్తే ఎన్టీఆర్‌ ను చులకన చేసినట్టేనని తెలిపారు.

చంద్రబాబు బయట నుంచి పొడిచిన వెన్నుపోటు కు ఇంటర్నల్‌ గా పురందేశ్వరే ప్రధాన కారకురాలని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. పురందేశ్వరిని రాజకీయాల్లోకి వద్దు అన్నారని ఎన్టీఆర్‌ పై కుట్ర చేసిందని మండిపడ్డారు. తండ్రిపై కోపంతో కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. తనకు జరిగిన అవమానమే పురేందేశ్వరికి జరుగుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ రోజు నుంచి తన పోరాటమంతా పురందేశ్వరిపైనే ఉంటుందని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

ఎన్టీఆర్‌ పేరుతో వంద రూపాయిల నాణం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కానీ, తనకు ఆహ్వానం అందించకపోవడం, పిలవకపోవడం బాధగా అనిపిస్తోందన్నారు. ఈ విషయంపైన రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్థికమంత్రికి లేఖలు కూడా రాశానన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వమే నిర్వహిస్తే భార్యగా తనను పిలవకపోడం తప్పన్నారు. ఆహ్వానం చూస్తే ప్రైవేటు ఫంక్షన్‌ కి రాష్ట్రపతి గెస్ట్‌ గా వెళ్తున్నట్టు ఉందన్నారు. ఎన్టీఆర్‌ భార్యగా తనను పిలవకపోవడం అన్యాయమని చెప్పారు. ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారని తూర్పారబట్టారు. భార్యగా నాణెం అందుకోవడానికి అర్హత తనకే ఉందన్నారు. ఎన్టీఆర్‌ ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు ఎలా వెళ్లారు? అని సూటిగా నిలదీశారు.

తనకు జరిగిన అవమానాన్ని తన భర్త ఎన్టీఆర్‌ కు జరిగిన అవమానంగా భావిస్తానన్నారు. ఎన్టీఆర్‌ తనను వివాహం చేసుకున్నారో లేదో.. అయన పిల్లలు సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమానికి పిలవకుండా పురందేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. తాను ఎన్టీఆర్‌ భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ తో తనకు వివాహం అయినట్టు ఫోటోలు, వార్తా కథనాలు ఉన్నాయన్నారు. సాక్షాత్తూ ఎన్టీఆరే అనేకసార్లు బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ తనను పెళ్లి చేసుకోలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఇంతకాలం ఎన్టీఆర్‌ కుటుంబంపై అభిమానంతో సైలెంట్‌ గా ఉన్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టనని హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ ఇలా అందరినీ బయటకు లాగుతానన్నారు. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో లేకుండా చేస్తానని శపథం చేశారు.

ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ ను వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుందని ఆరోపించారు. భువనేశ్వరి, పురందేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారన్నారు. మళ్లీ పురందేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారన్నారు.

పురందేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేయడమేంటి? అని లక్ష్మీపార్వతి నిలదీశారు. ఆమె టీడీపీ ఏజెంట్‌ గా పనిచేస్తోందన్నారు. బీజేపీ పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ ఆమె చదువుతుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ కు ఆహ్వానం ఇచ్చారో లేదో తనకు తెలియదని లక్ష్మీపార్వతి తెలిపారు. ప్రభుత్వ ఇన్విటేషన్‌ అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ హాజరు అయ్యేవారన్నారు. ప్రైవేటు ఫంక్షన్‌ కనుకే ఆయనæ హాజరుకాలేదన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తే అక్కడ చంద్రబాబు, అతడిని కలపడానికి పురందేశ్వరి ప్రణాళిక రచించిందన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్‌ లను కలుస్తా అని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.

కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరు కాకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, టీడీపీ ఎంపీలు ఇలా అందరూ హాజరయినా జూనియర్‌ ఎన్టీఆర్‌ రాలేదు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి పురందేశ్వరి, ఎన్టీఆర్‌ మరో కుమార్తె లోకేశ్వరి, కుమారులు బాలకృష్ణ, రామకృష్ణ (జూనియర్‌), మోహనకృష్ణ, నందమూరి కల్యాణ్‌ చక్రవర్తి, బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు కూడా వచ్చారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ కు అసలు ఆహ్వానం అందలేదని ఓవైపు టాక్‌ నడుస్తోంది. మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ వరుసగా మూడు రోజులపాటు దేవర సినిమా షూటింగులో బిజీగా ఉంటారని.. అందుకే ఢిల్లీకి రాలేదని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.