Begin typing your search above and press return to search.

ఒకే గొడుగు కిందకి నందమూరి కుటుంబం.. టీడీపీకి లాభించేనా?

దీంతో పురందేశ్వరి ఇప్పటికి ఎన్టీ రామారావు కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ఇలా అందరినీ ఆహ్వానించారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 7:13 AM GMT
ఒకే గొడుగు కిందకి నందమూరి కుటుంబం.. టీడీపీకి లాభించేనా?
X

దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుటుంబం అంతా ఒకే ఛత్రం కిందకు రాబోతోంది. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన బొమ్మతో ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని విడుదల చేస్తోంది. ఆగస్టు 28న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... ఎన్టీఆర్‌ బొమ్మతో కూడిన రూ.100 నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ నాణేనికి ఒక వైపు మూడు సింహాల బొమ్మ, ఇంకోవైపు ఎన్టీఆర్‌ చిత్రం ఉంటాయి. దానికింద ఎన్టీఆర్‌ శత జయంతి అని హిందీలో రాసి ఉంటుందని అని చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా తెస్తున్న ఈ రూ.100 నాణేన్ని 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో వెండి, రాగి, నికెల్, జింక్‌ మిశ్రమాలతో తయారు చేశారు. రాష్ట్రపతి భవన్‌ లో జరిగే నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఈ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్‌ కుమార్తె, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది.

దీంతో పురందేశ్వరి ఇప్పటికి ఎన్టీ రామారావు కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనవరాళ్లు ఇలా అందరినీ ఆహ్వానించారు. మరోవైపు ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతికి పిలుపు దక్కలేదు. దీంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాశారు. ఎన్టీఆర్‌ భార్యనైన తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం న్యాయం కాదని పేర్కొన్నారు.

కాగా ప్రముఖ సినీ నటులు జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ లతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ లకు సైతం పురందేశ్వరి ఆహ్వానాలు పంపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 28న ఎన్టీఆర్‌ కుటుంబమంతా ఢిల్లీ వెళ్లనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జూనియర్‌ ఎన్టీఆర్, బాలకృష్ణ సహా అంతా పాల్గొంటారని చెబుతున్నారు. అయితే లోకేశ్‌ పాదయాత్ర చేస్తుండటంతో ఆయన హాజరు కారని తెలుస్తోంది.

మరోవైపు ఈ సువర్ణావకాశాన్ని టీడీపీ ప్రయోజనానికి వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ఏపీలో పొత్తులో ఉన్నాయి. బీజేపీని కూడా తమతో కలుపుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండటంతో ఇందుకు ఆమె సైతం సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధిష్టానాన్ని మాత్రమే ఒప్పించాల్సి ఉంది.

మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కూడా మరోసారి టీడీపీ ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్‌ టీడీపీకి ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌.. లోకేశ్‌ కు పోటీ వస్తాడని చెప్పి.. ఆయనను లైట్‌ తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈసారి ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఈసారి ఎన్నికలు టీడీపీకి చావో, రేవో లాంటివి. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ను సైతం టీడీపీ తరఫున ప్రచారం చేయించే వీలుందని టాక్‌.

ఇందుకు ఆగస్టు 28న జరిగే ఎన్టీఆర్‌ శత జయంతి నాణెం కార్యక్రమం చంద్రబాబుకు వీలు కల్పిస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత సీఎం ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు అంతా హాజరయ్యే అవకాశం ఉండడం చంద్రబాబుకు సావకాశమంటున్నారు.

అయితే 2009 ఎన్నికల తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. 2018 ఎన్నికల్లో కూకట్‌ పల్లి నుంచి తన సోదరి సుహాసిని పోటీ చేసినా ఆయన ఆమె తరఫున ప్రచారం చేయకపోవడం ఇందుకు నిదర్శనం. సొంత సోదరి తరఫునే ప్రచారం చేయనివాడు ఇక ఇతర టీడీపీ నేతల ప్రచారానికి ఎందుకొస్తారనే చర్చ జరుగుతోంది. మరి చంద్రబాబు.. ఎన్టీఆర్‌ ను ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి.