నాగబాబు మనసు ఆ ఎంపీ సీటు పైన ?
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మక్కువ పడి మనసు పెంచుకున్న సీటు ఒకటి ఉందని అంటున్నారు.
By: Satya P | 16 March 2026 8:00 PM ISTజనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మక్కువ పడి మనసు పెంచుకున్న సీటు ఒకటి ఉందని అంటున్నారు. అదే ఉత్తరాంధ్ర జిల్లాలలోని అనకాపల్లి ఎంపీ సీటు అని చెబుతున్నారు. నిజానికి అన్ని కలసి వస్తే నాగబాబు ఇక్కడ నుంచి 2024 ఎన్నికల్లో జనసేన నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసి ఎంపీ కావడం ఖాయంగా జరిగి ఉండేది. కానీ చివరి నిమిషంలో పొత్తు సీట్ల సర్దుబాటులో వచ్చిన ఇబ్బందుల కారణంగా బీజేపీకి ఈ సీటు జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది అని చెబుతారు. అలా బీజేపీకి చెందిన సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అయిపోయారు. ఇక చూస్తే నాగబాబుకు 2024 చివరిలో రాజ్యసభకు ఏర్పడిన ఖాళీలలో కూడా సీటు దక్కలేదు. 2025 మార్చిలో ఆయన ఎమ్మెల్సీ కాగలిగారు. కానీ నాగబాబు మనసు మాత్రం పార్లమెంట్ మీదనే ఉంది అని అంటున్నారు.
ఉత్తరాంధ్రా ఫోకస్ :
జనసేన కీలక నాయకుడిగా నాగబాబు ఉత్తరాంధ్రా జిల్లాలలో తరచూ పర్యటిస్తున్నారు. ఇక్కడ ఉన్న మూడు ఉమ్మడి జిల్లాలలో ఆయన జనసేన కార్యక్రమాలను పరిశీలిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నాగబాబు శ్రీకాకుళం విశాఖ జిల్లాలలో పర్యటించి క్యాడర్ కి ఉత్తేజం కలిగించారు. అలాగే సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ఆయన పరిశీలిస్తూ కృషి చేస్తున్న క్యాడర్ ని ప్రోత్సహించారు. ఎమ్మెల్సీ కాక ముందు అయిన తరువాత కూడా నాగబాబు ఉత్తరాంధ్రా మీదనే ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. దానికి కారణం జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల తరువాత ఉత్తరాంధ్రలోనే బలం అధికంగా ఉంది అని అంటున్నారు.
పోటీ చేయలేకపోయా :
తాజా పర్యటనలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పార్టీ క్యాడర్ తో జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ తాను అనకాపల్లి ఎంపీ సీటు నుంచి అనివార్య కారణాల వల్ల పోటీ చేయలేకపోయాను అని చెప్పడం విశేషం. కూటమి పొత్తు ధర్మం వల్లనే అనకాపల్లి పార్లమెంట్ సీటుని జనసేన వదులుకోవాల్సి వచ్చింది అని నాగబాబు చెప్పడం గమనార్హం. జనసేన తానుగా ఈ సీటు వదులుకోవాల్సి వచ్చిందని కూడా గుర్తు చేశారు. అంతటితో ఆగని నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జనసేనకు మంచి బలం ఉందని దానిని పార్టీ క్యాడర్ అంతా కలసి మరింతగా బలోపేతం చేయాలని కోరడం విశేషం.
ఫ్యూచర్ ప్లాన్ ఏంటి :
నాగబాబు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యల మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో కూడా జిల్లాల పర్యటనలో ఆయన అనకాపల్లిని వదులుకున్నామని మంచి బలం ఉందని చెబుతూ వచ్చారు ఇపుడు మరో మారు ఆయన చెప్పడమే కాదు అక్కడ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని కోరడంతో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఆయనకు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. 2029 ఎన్నికల్లో నాగబాబు పార్లమెంట్ కి అనకాపల్లిని ఎంచుకుని మరీ పోటీ చేస్తారా అన్న ఊహాగానాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అనకాపల్లి పరిధిలో బలమైన సామాజిక వర్గం ఉంది. పైగా అక్కడ వైసీపీ ఈ రోజుకీ కొంత వీక్ గా ఉంది. ఇంకా కోలుకోలేదు అని అంటున్నారు. దాంతో జనసేన ఈ ప్రాంతంలో గట్టిగా నిలిచి బలపడేందుకు యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తోంది అని అంటున్నారు.
ఎంపీ కావాలన్నదే :
ఇక చూస్తే కనుక 2019లో జనసేన తరఫున నాగబాబు నరసాపురం నుంచి లోక్ సభకు పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లను సాధించారు నిజంగా ఒంటరి పోరులో భారీ ఎత్తున ఓట్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు, అయితే ఆనాడు వైసీపీ వేవ్ లో ఓటమి చూడాల్సి వచ్చింది అన్ అంటున్నారు. 2024లో అయితే అనకాపల్లి సీటు మొదట జనసేనకే ఇచ్చారు. నాగబాబు ఎన్నికలకు చాలా ముందుగానే వచ్చి ఎన్నికల కసరత్తుని మొదలెట్టారు. తీరా దగ్గర చేసి జనసేన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దాంతో పాటు రాజ్యసభకు సైతం వెళ్ళేందుకు నాగబాబుకు అవకాశం దక్కలేదు, ఎమ్మెల్సీగానే ఆయన ప్రస్తుతం ఉన్నారు. అందువల్ల ఆయన మనసులో ఎంపీ కావాలని బలంగా ఉంది అని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
