మంత్రి మనోహర్‌కు సెగ.. ఆ నిధులు ఏమయ్యాయి ..!
అయితే.. అందరికీ తొలి విడతలో నిధులు ఇచ్చేశామని మంత్రి ప్రకటించారు. ఇలా ప్రకటించిన రెండో రోజే ఆయన తెనాలిలో పర్యటించారు.
By: Tupaki Desk | 9 May 2025 1:30 PMరాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు సెగ పెరుగుతోంది. గురువారం ఆయన తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. అదే సమయంలో రైతుల నుంచి కూడా ఎదురు ప్రశ్నలు వచ్చాయి. వీటికి సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరికి గురైన నాదెండ్ల.. అక్కడనుంచి వెళ్లిపోయారు. గత ఏడాది అక్టోబరులో ఉచిత సిలెండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
దీపం-2 పథకంగా పేర్కొంటున్న ఉచిత సిలెండర్ల పథకంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలోనే .. 20 వేల మంది లబ్ధిదారులకు తొలి విడత సిలెండర్లకు (మార్చితోనే ముగిసింది) ఇప్పటికీ సొమ్ములు పడలేదు. అయితే.. అందరికీ తొలి విడతలో నిధులు ఇచ్చేశామని మంత్రి ప్రకటించారు. ఇలా ప్రకటించిన రెండో రోజే ఆయన తెనాలిలో పర్యటించారు. అక్కడే ఆయనకు సెగ తగిలింది. ఇక, రైతుల నుంచి ప్రతి గింజా కొన్నామని ఆయన చెప్పగా.. దుగ్గిరాలకు చెందిన రైతులు.. ఆయన ముందు పెరేడ్ పెట్టారు.
ఇదిలా వుంటే.. దీపం-2 పథకంలో రెండో విడత ఉచిత సిలిండర్ల పంపిణీని ఏప్రిల్ 1న ప్రారంభించారు. అప్పటి నుంచి నాలుగు మాసాల్లో ఎప్పుడు బుక్ చేసుకున్నా.. సదరు సిలిండెర్ సొమ్మును బ్యాంకు ఖాతా ల్లో వేస్తామని స్వయంగా మనోహరే చెప్పారు. అయితే.. ఏం జరిగిందో ఏమో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండో విడత సిలిండర్ సొమ్ములు ఇప్పటికీ జమ కాలేదు. దీంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. దీంతో వారు తమ తప్పులేదని.. ప్రభుత్వం ఇవ్వలేదని చెబుతున్నారు.
కానీ, ఇప్పటికే రెండో విడత సిలిండర్ల పంపిణీ ప్రారంభమై 40 రోజులు అవుతోంది. అయినా.. నిధులు ఇవ్వకపోవడంపై మనోహర్‌ను తెనాలిలో మహిళలు నిలదీశారు. గత తొలి విడతతోపాటు.. రెండో విడత నిధులు కూడా విడుదల చేశామని.. మంత్రిచెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క జిల్లాలోనూ.. నిధులు ఎవరికీ రాలేదు. దీంతో దీపం-2పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరి మంత్రి తప్పా.. నిజంగానే నిధులు రాలేదా? అనేదానిపై క్లారిటీ ఇస్తే.. ఈ విషయంలో విమర్శలు తగ్గుతాయని అంటున్నారు పరిశీలకులు.