Begin typing your search above and press return to search.

ప్లెక్సీలు, బ్యానర్లు కడితే నాయకులు అయిపోరు..!! స్థానిక ఎన్నికలపై జనసైనికులకు బిగ్ అలర్ట్

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   16 July 2026 1:51 PM IST
ప్లెక్సీలు, బ్యానర్లు కడితే నాయకులు అయిపోరు..!! స్థానిక ఎన్నికలపై జనసైనికులకు బిగ్ అలర్ట్
X

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, ఎక్కడెక్కడ పోటీ అంటూ నేతలు, కార్యకర్తలు అడుగుతుండటంపై మంత్రి నాదెండ్ల స్పందించారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయుత్తం చేసే అంశంపై మాట్లాడిన ఆయన పార్టీ నేతలు ముందుగా సంస్థాగతంగా బలోపేతం కావాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అన్న విషయం ప్రధానం కాదని, ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామో ముందుగా గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు.

మరో మూడు నాలుగు నెలల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాకుండా స్థానిక ఎన్నికలపై మూడు పార్టీల సమన్వయం సమావేశం జరిగిన తర్వాత మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెరలేపాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం పార్లమెంటు, అసెంబ్లీ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 18 లోగా కమిటీలు నియామకం పూర్తవ్వాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ అంతర్గత కసరత్తు మొదలుపెట్టింది.

స్థానిక ఎన్నికలకు పార్టీని సమాయుత్తం చేయడంపై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహణకు జనసేన నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో చర్చావేదిక అన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి హోదాలో హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికలపై కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కన్నా, గెలిచే స్థానాల్లో పోటీ చేయడమన్న సిద్ధాంతం ఆధారంగానే సీట్లు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తాం? అన్న విషయాలను పక్కన పెట్టి నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది? ప్రజలు ఏవిధంగా ఆదరిస్తున్నారనేదానిపై దృష్టిపెట్టాలని సూచించారు. నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుందనేది గుర్తించిన తర్వాతే పోటీపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి మనోహర్ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు నాయకులు కాదని, క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజాభిమానం పొందాలని కర్తవ్యబోధ చేశారు. అదేసమయంలో కూటమిలోని ఇతర పార్టీలతో సర్దుకుపోవాల్సిన అవసరంపైన హితబోధ చేశారు.