Begin typing your search above and press return to search.

ముద్రగడ పవన్ భేటీకి ముహూర్తం అపుడేనా...!?

గోదావరి జిల్లాలలో కాపు నేతగా పేరున్న వారు ముద్రగడ పద్మనాభం. ఆయన రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను చూసారు

By:  Tupaki Desk   |   20 Feb 2024 11:30 PM GMT
ముద్రగడ పవన్ భేటీకి ముహూర్తం అపుడేనా...!?
X

గోదావరి జిల్లాలలో కాపు నేతగా పేరున్న వారు ముద్రగడ పద్మనాభం. ఆయన రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను చూసారు. అలాగే ఎన్నో పార్టీలు మారారు. ఎక్కడా ఇమడలేక తన జాతి కోసం ఉద్యమం అంటూ ఆయన గడచిన కొన్నేళ్ళుగా కాపు ఉద్యమం చేపట్టారు. అయితే ఆయన 2019 తరువాత కాపు ఉద్యమం నుంచి దూరం జరిగారు. 2024 ఎన్నికల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూశారు.

ఆయన వైసీపీలో చేరుతారు అని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన జనసేనలోకి వెళ్తారు అన్న ప్రచారం మొదలై నెల రోజులు గడిచింది. ఆయన దగ్గరకు స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి మరీ కాపు ఉద్యమ నేతను గౌరవంగా పార్టీలోకి చేర్చుకుంటారు అని కూడా టాక్ నడచింది. పవన్ ముద్రగడల భేటీకి మధ్యవర్తిత్వం వహించింది జనసేన కీలక నేత బొలిశెట్టి శ్రీనివాస్. తాజాగా మరోసారి ముద్రగడ పవన్ ల భేటీ విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని ముద్రగడ అనుచరులు ఆయన దృష్టిలో ఉంచారు. దానికి ముద్రగడ రియాక్షన్ భిన్నంగా ఉందని అంటున్నారు. నేను కాపు నాయకుడిగా జనసేనలో చేరే విషయం మీద ఆమోదం తెలిపాను అని చెప్పారు. ఇక అక్కడితో తన బాధ్యత తీరిపోయింది అని కూడా అంటున్నారు.

తనను పవన్ కళ్యాణ్ వచ్చి కలవడం అన్నది ఆయన ఇష్టం అని ముద్రగడ అన్నారని టాక్ నడుస్తోంది. పవన్ నా ఇంటికి వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అని ముద్రగడ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు అని అంటున్నారు. నిజానికి ముద్రగడ పవన్ భేటీ అదిగో ఇదిగో అంటూ చాలా కాలం గడచింది.

ముద్రగడ తన వద్దకు వచ్చిన జనసేన నేతలకు కొన్ని ప్రతిపాదనలు చేశారు అని అంటున్నారు. మరి అవి పవన్ దృష్టిలోకి వెళ్ళి ఆయన దాని మీద ఏ విధంగా ఆలోచించారో తెలియదు అని అంటున్నారు. పవన్ ఇప్పటిదాకా ముద్రగడతో భేటీ కాకపోవడం వెనక కారణాలు ఏమిటి అన్న చర్చ కూదా ఉంది.

ఇక ముద్రగడ జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారు అని కూడా మరో వైపు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ 2024 ఎన్నికల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ముద్రగడ భావించారు అని అంటున్నారు. ఆయన అనుచరులతో పాటు తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకుని రాజకీయంగా బలంగా నిలవాలని అనుకున్నారు అని వార్తలు వచ్చాయి

ఇపుడు చూస్తే ముద్రగడ రాజకీయం ఇక్కడితో ఆగినట్లేనా అన్న చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ జనసేనలోకి ముద్రగడ వెళ్తారు అని వైసీపీలో చేరేది లేదని కూడా గతంలో ప్రకటన వచ్చింది. దాంతో అక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. చూస్తూ చూస్తూ టీడీపీలోకి ఎటూ ఆయన పోలేరు. మొత్తానికి చూస్తే ముద్రగడ పవన్ భేటీ ఎపుడూ అంటే అపుడూ అనే జవాబు వస్తోంది. ఆ అప్పుడు ఎన్నికలు అయ్యేలోగా ఉంటుందా లేక ఆ తరువాతనా అంటే కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.