Begin typing your search above and press return to search.

ముద్రగడ వైసీపీ... గ్యాప్ ఎక్కడ వచ్చింది...!?

గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి వైసీపీకి మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది అన్న చర్చ జోరుగా సాగుతోంది

By:  Tupaki Desk   |   13 Jan 2024 1:30 AM GMT
ముద్రగడ వైసీపీ... గ్యాప్ ఎక్కడ వచ్చింది...!?
X

గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి వైసీపీకి మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది అన్న చర్చ జోరుగా సాగుతోంది. 1999లో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా ముద్రగడ గెలిచారు 2004లో మరోసారి ఆయన టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన టీడీపీకి దూరం అయ్యారు.

ఇక ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తరువాత ఆయన కాపు ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే ముద్రగడ టీడీపీని వదిలేసి రెండు దశాబ్దాల కాలం అయింది. చంద్రబాబుని ఆయన డైరెక్ట్ గానే విభేదిస్తూ వచ్చారు

చంద్రబాబు వ్యవహార శైలిని ఆయన ఎప్పటికపుడు తప్పు పడుతూ వచ్చారు చంద్రబాబుని రాజకీయంగా ఇంతలా వ్యతిరేకించిన నాయకుడు బహుశా మరొకరు వర్తమాన రాజకీయాల్లో ఉండరు అని అంటారు. బాబు పట్ల వ్యతిరేకత జగన్ పట్ల సానుకూలతగా కూడా మారి ఉండవచ్చు అని అంటారు.

ఇవన్నీ ఇలా ఉంచితే ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు. ఆయన కూడా జగన్ ప్రభుత్వం మీద గత నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా జగన్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కొన్ని సూచనలు ఇస్తూ వచ్చారు ఇవన్నీ పక్కన పెడితే 2004 జనవరి ఒకటవ తేదీన ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం వైసీపీలో ముద్రగడ చేరిన ఇలా లాంచనం అన్నట్లుగానే సాగింది.

అయితే ఆ తరువాతనే ఏదో తేడా జరిగింది అని అంతా అనుకున్నారు ఇంతకీ జరిగింది ఏంటి అంటే ప్రచారంలో ఉన్న వార్తలు బట్టి చూస్తే ముద్రగడ పిఠాపురం ప్రత్తిపాడుతో పాటు కొన్ని సీట్లను తన సన్నిహితులకు కోరారని, అలాగే కాకినాడ ఎంపీ సీటుని కూడా కోరారని అంటున్నారు.

అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ముద్రగడకు కాకినాడ పార్లమెంట్, ఆయన తనయుడు గిరిబాబుకు పెద్దాపురం టికెట్ ని ఇవ్వాలని చూసింది అని అంటున్నారు. దీంతోనే గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. ఇక ఆ తరువాతనే వైసీపీ రెండవ జాబితా ప్రకటించేసింది. అందులో పిఠాపురం ప్రత్తిపాడు నియోజకవర్గాలు రెండింటికీ ఇంచార్జిలను పార్టీ నియమించింది.

దాంతో వైసీపీలో ముద్రగడ చేరిక ఇక ఉండదు అని ఈ విషయాలు తెలిసిన వారు అనుకున్నారని అంటున్నారు. ఇక ఈ విషయాలు తెలిసిన జనసేన నేతలు ఆయనను సంప్రదించారని అంటున్నారు. ఇక జనసేన నేతలు ముద్రగడను కలసినపుడు ఆయన తన ఆలోచనలు వారితో పంచుకున్నారని అంటున్నారు.

ఇక ముద్రగడ జనసేనలో చేరడానికి కూడా ఆయన కోరిన సీట్లు ఇస్తేనే అన్న కండిషన్ ఉందని అంటున్నారు. ఆ విధంగా ముద్రగడకు సీట్లు ఇచ్చేందుకు జనసేనకు అభ్యంతరం ఉండకపోవచ్చు అని అంటున్నారు దాంతో ముద్రగడ అనూహ్యంగా టీడీపీ జనసేన కూటమిలోకి వస్తున్నారు అని అంటున్నారు.

ఇక ముద్రగడ జనసేనలో చేరిక మీద తనకు ఎటువంటి సమాచారం లేదని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కుటుంబాల పరంగా తాము సీట్లు ఇవ్వలేమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కుటుంబంలో అర్హులైన వారు ఉంటే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు. ప్రజాబలం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని అన్నారు.

వైసీపీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చూస్తోందని టీడీపీ హయాంలో అన్యాయం జరిగిన బీసీలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని ఆయన అన్నారు. మొత్తానికి వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ ఇపుడు కొంత సంచలనంగా మారుతున్నాయి.