Begin typing your search above and press return to search.

కేసీఆర్.. చంద్రబాబు.. జగన్.. అందరికీ మోత్కుపల్లి తలంటు

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ప్రస్థానం.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి కూడా పోటీ చేసిన వైనం

By:  Tupaki Desk   |   25 Sep 2023 10:04 AM GMT
కేసీఆర్.. చంద్రబాబు.. జగన్.. అందరికీ మోత్కుపల్లి తలంటు
X

టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ప్రస్థానం.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి కూడా పోటీ చేసిన వైనం.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. మంత్రిగానూ బాధ్యతలు.. ఒకటీ రెండు సార్లు కాదు ఆరుసార్లు ఎమ్మెల్యే.. ఇదంతా ఒకే రాజకీయ నాయకుడి ప్రయాణం. ఇదంతా మోత్కుపల్లి నర్సింహులు గురించి. 1983లోనే ఎమ్మెల్యే అయిన ఆయన 1999 వరకు ఐదు సార్లు నెగ్గారు. 2009లో చివరిసారిగా తుంగతుర్తి నుంచి గెలుపొందారు. 2014లో ఏకంగా ఖమ్మం జిల్లా మధిరలోనూ బరిలో దిగారు. ఆలేరు జనరల్ అయినప్పటికీ 2018లో మళ్లీ పోటీకి దిగి పరాజయం ఎదుర్కొన్నారు.

టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ పై

మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది టీడీపీ నుంచి. 2018 వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న నల్లగొండ జిల్లాకు చెందినవారు అయినప్పటికీ టీడీపీని వీడలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేసేవారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మోత్కుపల్లి నాడు వ్యవహరించారు.

గవర్నర్ గిరీపై ఆశతో..

2014లో ఏపీ విభజన అనంతరం.. విభజిత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మోత్కుపల్లికి తగిన ప్రాధాన్యం దక్కుతుందనే కథనాలు వచ్చాయి. అప్పట్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుండడంతో మోత్కుప్లిని గవర్నర్ గా పంపుతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఇవేవీ నిజం కాలేదు. దీంతో 2018లో మోత్కుపల్లి టీడీపీని వీడారు.

2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుపై

2019 ఎన్నికల నాటికి మోత్కుపల్లి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. టీడీపీకి వ్యతిరేకం కాబట్టి.. వీటిని వైసీపీ చక్కగా ఉపయోగించుకుంది. అప్పట్లో మోత్కుపల్లి మాటలకు మంచి ప్రాధాన్యమే దక్కింది.

దళితబంధుతో దగ్గరకు తీసిన కేసీఆర్

2021 జూలైలో బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లిని 2021 సెప్టెంబరులో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దగ్గరకు తీశారు. అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడంతో ..మోత్కుపల్లిని కొత్తగా ప్రవేశపెట్టిన పథకం దళిత బంధుకు చైర్మన్ చేస్తారనే కథనాలు వచ్చాయి. అయితే, అవి ఎంతవరకు నెరవేరినదీ తెలియరాలేదు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అయితే, మోత్కుపల్లిని వెంటబెట్టుకుని కేసీఆర్ యాదాద్రి ఆలయ సందర్శనకు వెళ్లారు.

జగన్, కేసీఆర్ కు వ్యతిరేకంగా నేడు

మోత్కుపల్లికి బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కలేదు. ఇటీవలి అభ్యర్థుల జాబితాలోనూ చోటివ్వలేదు. దీంతోనే అసహనానికి గురయినట్లున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కూడా చోటుచేసుకుంది. ఇదే అదనుగా చంద్రబాబుకు మద్దతుగా మోత్కుపల్లి.. దీక్షకు దిగారు. దళితులను దగ్గరకు రానీయరంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ నూ తూర్పూరబట్టారు. జగన్ విధానాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. జగన్ ను నియంతగా సంబోధించారు.

రేవంత్ కు ప్రశంసలు

మోత్కుపల్లి ఆదివారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. ఆయన వల్లే కాంగ్రెస్ బలోపేతం అయిందన్నారు. దీంతో మోత్కుపల్లి కాంగ్రెస్ లో చేరనున్నట్లు స్పష్టమవుతోంది.