Begin typing your search above and press return to search.

ఎండలకు వీడ్కోలు.. ఏపీని తాకిన నైరుతి

ఏపీ ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించనుంది. రెండు రోజుల క్రితం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాష్ట్రంలో అడుగుపెట్టాయని భారత వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

By:  Tupaki Desk   |   6 Jun 2026 5:00 PM IST
ఎండలకు వీడ్కోలు.. ఏపీని తాకిన నైరుతి
X

ఏపీ ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించనుంది. రెండు రోజుల క్రితం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాష్ట్రంలో అడుగుపెట్టాయని భారత వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతుండటంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ ఏడాది మూడు రోజుల ఆలస్యంగా రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని చెబుతున్నారు. ఎల్ నినో భయాల మధ్య రుతుపవనాలు సమయానికి రావడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తరణ

రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తరిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవి మరింత ముందుకు సాగడానికి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

రుతుపవనాల రాకతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నందున, రైతులు తమ వ్యవసాయ పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చునని స్పష్టం చేస్తున్నారు. అయితే, భారీ వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తగ్గనున్న ఎండల తీవ్రత

గత కొన్ని వారాలుగా భానుడి కారణంగా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఈ చల్లటి కబురుతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంటోంది. దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం నరకం అనుభవిస్తున్నారు. జూన్ రావడంతోనే వాతావరణం చల్లబడుతుందని ఆశించినా తొలి వారం మాత్రం ఎండ మంటలు తప్పలేదని వాపోతున్నారు. ఇక రుతుపవనాలు రాకతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.