Begin typing your search above and press return to search.

గంగమ్మ దీవెన.. నేను ఆమె బిడ్డను.. వారణాసిపై మోదీ భావోద్వేగం

కాగా, మోదీ ప్రధాని అయ్యాక గంగానదిని శుద్ధి చేసే లక్ష్యంతో నమామి గంగ ప్రాజెక్టును చేపట్టారు. పదేళ్లుగా అది కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   14 May 2024 6:07 AM GMT
గంగమ్మ దీవెన.. నేను ఆమె బిడ్డను.. వారణాసిపై మోదీ భావోద్వేగం
X

ముచ్చటగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తూ.. హ్యాట్రిక్ ప్రధాని కావాలనుకుంటున్న నరేంద్ర మోదీ.. ఈ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ఈ పవిత్ర పుణ్యక్షేత నగరం హిందువులందరికీ ఎంతో పవిత్రమైనది అని తెలిసిందే. అలాంటిచోట నుంచి 2014లో పోటీకి దిగిన మోదీ.. 3.70 లక్షల ఓట్ల మెజారిటీతో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించారు. 2019లో ఏకంగా 4.79 లక్షల ఆధిక్యంతో సమాజ్ వాదీ అభ్యర్థి మాలినీ యాదవ్ పై నెగ్గారు. ఈసారి కూడా భారీ ఆధిక్యంపైనే కన్నేసిన మోదీ.. మూడోసారి పోటీకి నామినేషన్ వేయనున్నారు. వారణాసిలో ఏడో దశలో భాగంగా జూన్‌ ఒకటిన పోలింగ్ జరగనుంది.

ఈ బంధం విడదీయరానిది..2014 వరకు గుజరాత్ సీఎంగా ఉంటూ.. హిందూత్వ ప్రతినిధిగా మెజారిటీ ప్రజల్లో ముద్రపడిన మోదీ, ప్రధాని అభ్యర్థిగా 2014లో వారణాసిని ఎంచుకోవడంలోనూ వ్యూహాత్మక ఎత్తు ఉందనే భావించాలి. తద్వారా ఓ వర్గం ఓట్లను సంఘటితం చేయడంతో బీజేపీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టింది. ఇప్పుడు మరోసారి నామినేషన్ వేయనున్న సందర్భంగా తన సిటింగ్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అభివర్ణించారు. ఈ ప్రాంతంలో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

ఒకప్పుడు కాశీగా భాసిల్లిన వారణాసి నగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో అంతకంత పెరుగుతూ వచ్చిందని భావోద్వేగంతో పేర్కొన్నారు.

గంగమ్మే నను పిలిచింది వారణాసి ప్రాంతంలో నిర్వహించిన రోడ్‌ షోలు, ఆధ్యాత్మిక పర్యటనలు తనకు ఈ నగరంతో అనుబంధాన్ని పెంచాయని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ(నది) నన్ను ఆహ్వానించిందా అని అనిపించింది. పదేళ్ల తర్వాత.. ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుంది. ఇన్నేళ్లలో కాశీతో నా బంధం దృఢమైంది. ఇప్పుడీ నేల నాది. తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

వారణాసిలో రోడ్ షో తొలిసారి నామినేషన్ వేసినప్పటి నుంచి మోదీ వారణాసిలో రోడ్ షో చేస్తున్నారు. ఈసారి కూడా సోమవారం సాయంత్రం వారణాసి చేరుకున్న ఆయన యూపీ సీఎం యోగితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల మేర సాగిన ఈ భారీ రోడ్‌ షో అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. రాత్రికి ఇక్కడే బస చేశారు.

కాగా, మోదీ ప్రధాని అయ్యాక గంగానదిని శుద్ధి చేసే లక్ష్యంతో నమామి గంగ ప్రాజెక్టును చేపట్టారు. పదేళ్లుగా అది కొనసాగుతోంది.