బెంగాల్ దంగల్: ప్రచారం సమాప్తం.. చెమటోడ్చిన మోదీ-దీదీ!
రెండో దశ పోలింగ్‌కు సంబంధించి బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరుకనిపించింది. కాంగ్రెస్ సహా వామపక్షాల ప్రచారం పెద్దగా కనిపించలేదు.
By: Garuda Media | 27 April 2026 10:58 PM ISTదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ దశలో 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంతేకాదు.. ఈ పోరులోనే కీలకమైన నాయకుల భవితవ్యం కూడా తేలిపోనుంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గం పోలింగ్ ఈ దశలోనే జరగనుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ నుంచి కేంద్ర హోం మంత్రి అమితా షా వరకు బీజేపీపక్షాన చెమటోడ్చారనే చెప్పాలి.
రెండో దశలో పోలింగ్ ప్రక్రియ జరగనున్న 142 నియోజకవర్గాల్లోని ఓటర్లను చేరుకోవడానికి రాజకీయ పార్టీలు తమ చివరి ప్రయత్నం మరింత ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంకినారా సహా.. అనేక నియోజకవర్గాల్లో చివరి రోజు సుడిగాలి పర్యటనలు చేశారు. సీనియర్ బీజేపీ నాయకుడు అమిత్ షా హుగ్లీ జిల్లాలోని చందన్‌నగర్ సహా పలు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా ఇతర బీజేపీ నాయకులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
మండే ఎండల్లో..
మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో రోడ్‌షో నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్య దర్శి అభిషేక్ బెనర్జీ హుగ్లీలోని ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించి, అనంతరం మహేష్‌తలాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇలా.. చివరి రోజు ఉదయం 6 గంటలకే ప్రజల మధ్యకు వచ్చేశారు. సాయంత్రం కోడ్ గడువు సమయం ముగిసే వరకు ప్రతి ఒక్కరూ చెమటోడ్చారు. నిజానికి మండుతున్న ఎండలో నిలబడడమే కష్టమైనా.. నాయకులు చెమటలు తుడుచుకుంటూ.. ప్రజలకు అభివాదం చేస్తూ.. ఓట్లు అభ్యర్థించారు.
ప్రధాన పోరు- కీలక వ్యాఖ్యలు..
రెండో దశ పోలింగ్‌కు సంబంధించి బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరుకనిపించింది. కాంగ్రెస్ సహా వామపక్షాల ప్రచారం పెద్దగా కనిపించలేదు. సీనియర్లు, కీలక నాయకులు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఇక, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు జోరుగా తమ ప్రచారాన్ని కొనసాగించారు. ఇక, ఇరు పక్షాల మధ్య కామెంట్లు ఓ రేంజ్‌లో కురిశాయి. మహిళా బిల్లును వీగేలా చేసి మహిళలకు అన్యాయం చేశారంటూ.. సీఎం మమతపై ప్రధాని నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి రాగానే.. అక్రమాలు, అన్యాయాలపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. మే 4 తర్వాత.. వారంతా(తృణమూల్ అక్రమాలు అని ప్రధాని చెప్పారు) జైల్లో ఉంటారని ఉద్ఘాటించారు. ఇక, ఇప్పుడు వెళ్తున్నానని.. మేలో తిరిగి వస్తానని మోడీ చెప్పారు. ఆ రోజు సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
మీపైనే యుద్ధం చేస్తాం: మమత
ఇక,సీఎం మమతా బెనర్జీ కూడా ఎక్కడా తగ్గలేదు. మే 4న వచ్చే ఫలితాల్లో బీజేపీ కమలం రెక్కలు విరిగిపోతాయని బెనర్జీ వ్యాఖ్యానించారు. తాము నాలుగో సారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. వచ్చీరాగానే ఢిల్లీపైనే(మోడీ) యుద్ధం చేస్తామని.. ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తామని.. ఆమె చెప్పుకొచ్చారు. ఇలా.. మొత్తంగా అనేక అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. కాగా.. బుధవారం ఉదయం 7- సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. మే 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితం వెలువడనుంది. వీటిలో అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి(కేంద్ర పాలిత ప్రాంతం), పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
