Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ టేకాఫ్ అంత టెన్షన్ గా సాగిందా?

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పున: ప్రారంభ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేపట్టే కార్యక్రమం అనుకున్నట్లే సక్సెస్ ఫుల్ గా పూర్తైంది.

By:  Tupaki Desk   |   3 May 2025 10:44 AM IST
Modi Missed His Helicopter from Amaravati
X

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పున: ప్రారంభ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేపట్టే కార్యక్రమం అనుకున్నట్లే సక్సెస్ ఫుల్ గా పూర్తైంది. అయితే.. ప్రధాని వ్యక్తిగత సిబ్బంది మొదలు భద్రతాధికారులు.. పోలీసులు మాత్రం తీవ్ర టెన్షన్ కు గురయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రధాని మోడీ కార్యక్రమాలు అన్నీకూడా షెడ్యూల్ కు తూచా తప్పకుండా సాగుతాయి. కానీ.. అమరావతి ప్రోగ్రాం మాత్రం గంట ఆలస్యంగా పూర్తి కావటం.. నిర్దేశిత టేకాఫ్ సమయానికి తిరిగి వెళ్లకుంటే ఏం చేయాలన్న దానిపై పడిన ఆందోళన అంతా ఇంతా కాదు.

ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం ఆరు గంటలకు ముందే టేకాఫ్ కావాలి. ఒకవేళ ఆరు గంటలు దాటితే అయితే మాత్రం.. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ కు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ విషయాన్ని పైలట్లు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆయన్ను ఆరు గంటల్లోపు టేకాఫ్ అయ్యేలా చేసేందుకు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు.బహిరంగ సభ్య షెడ్యూల్ సమయానికి మించి గంట అదనంగా సాగటంతో టెన్షన్ మొదలైంది.

ఈ ఆలస్యం ఎస్పీజీ.. పోలీసులకు నరాలు తెగేంత ఉత్కంటకు కారణమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 4.45 గంటలకు సభా కార్యక్రమంయ పూర్తి చేసుకొని బయలుదేరాల్సి ఉంటుంది. అయితే.. ముఖ్య నేతల ప్రసంగాల కారణంగా సభ 5.45 గంటల వరకు సాగింది. అంటే.. దాదాపు గంట ఆలస్యమైంది. అప్పటికే వెలుతురు తగ్గింది. ఆరు గంటలు దాటితే హెలికాఫ్టర్ లో ప్రయాణించటానికి కుదరదు. దీంతో.. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు.

ఏమైనా తేడా వచ్చి హెలికాఫ్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లే అవకాశం లేకపోతే.. రోడ్డు మార్గంలో అమరావతి నుంచి గన్నవరం వెళ్లేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అలా అని.. ప్రధాని మోడీని త్వరగా బయలుదేరాలని చెప్పే సాహసం చేయలేరు. దీంతో.. ఆయన హెలికాఫ్టర్ లో గన్నవరం చేరుకుంటారా? రోడ్డు మార్గంలో వెళతారా? అన్నది టెన్షన్ గా మారింది. ఒక వేళ రోడ్డు మార్గంలో వెళితే.. భద్రతా ఏర్పాట్లు సమీక్షించటం.. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవటం కత్తి మీద సాము అవుతుంది.

ఇలాంటి టెన్షన్ల నేపథ్యంలో సభా ప్రాంగణం నుంచి హెలిప్యాడ్ కు ప్రధాని కాన్వాయ్ 5.52 గంటలకు చేరుకుంది. మరో 8 నిమిషాల వ్యవధిలో హెలికాఫ్టర్ టేకాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్ననేతలు వీడ్కోలు పలుకుతుంటే.. మరోవైపు గడువు ముగుస్తున్న వైనంతో అక్కడి భద్రతా సిబ్బంది టెన్షన్ తో కిందా మీదా పడుతున్నారు. అయినప్పటికి ఆ విషయాలేవీ బయటకు కనిపించకుండా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రధాని..రాష్ట్ర ముఖ్యమంత్రి.. అసెంబ్లీ స్పీకర్.. డిప్యూటీ స్పీకర్.. హోం మంత్రి లాంటి వారు ఉండటంతో.. తొందరపెట్టలేరు. గడువు ముగుస్తుందని చెప్పలేరు. ఏం జరుగుతుందో అర్థం కాని వేళలో ఈ టెన్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా.. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ లోకి ఎక్కటం.. టేకాఫ్ అయ్యే వేళకు టైం 5.57 గంటలు కావటంతో అందరూ ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. గడువుకు మూడు నిమిషాల ముందు ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్ గన్నవరం ఎయిర్ పోర్టు దిశగా వెళ్లిపోయింది.