Begin typing your search above and press return to search.

మూడూ పార్టీల ఉమ్మడి కంచుకోటలో ఉండవల్లి శ్రీదేవి?

ఈ సమయంలో టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు సుమారు పాతిక నుంచి ముప్పై మంది త్యాగాలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   27 Oct 2023 3:59 AM GMT
మూడూ పార్టీల ఉమ్మడి కంచుకోటలో ఉండవల్లి శ్రీదేవి?
X

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ - జనసేనల పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి మేనిఫెస్టోపై పనులు జరుగుతున్న నేపథ్యంలో... త్వరలో సీట్ల సర్ధుబాటుపై కూడా ఒక అవగాహనకు రావొచ్చని అంటున్నారు. అయితే నవంబర్ 8న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

ఈ సమయంలో టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు సుమారు పాతిక నుంచి ముప్పై మంది త్యాగాలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో కూడా టీడీపీ నేతల త్యాగాలు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టాపిక్ ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశం అయ్యింది.

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పై నాలుగు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆమెను సర్ధుబాటు చేయడం క్లిష్టంగా మారిందని అంటున్నారు. తాడికొండలో శ్రావణ్ ని కాదని శ్రీదేవికి టిక్కెట్ ఇవ్వలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పైగా... తాడికొండలో శ్రీదేవికి ఈసారి గెలుపు అంత సులువు కాదనే మాటలూ వినిపిస్తున్నాయి. కేడర్ ను కలుపుకుపోయే విషయంలోనే కానీ.. అనుచరులను సర్ధుబాటు చేసే విషయంలో కానీ సక్సెస్ కాలేదనే కామెంట్లు అప్పట్లో బలంగా వినిపించాయి! ఈ సమయంలో టీడీపీ - జనసేన పొత్తు నేపథ్యంలో... ఆమెకు తిరువూరు నియోజకవర్గం కేటాయించబోతున్నారని తెలుస్తుంది.

అవును... టీడీపీ, జనసేన పార్టీల సభ్యులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఉండవల్లి శ్రీదేవిని తిరువూరు నియోజకవర్గానికి సంభావ్య అభ్యర్థిగా పరిశీలిస్తోందని తెలుస్తుంది. శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన నాయకురాలు కాగా, ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి! ఈ సమయంలో రిజర్వ్డ్ నియోజకవర్గం అవ్వడంతోపాటు కాపు ఓటు బ్యాంకు కూడా ఎక్కువగానే ఉందనిచెబుతున్న తిరువూరు అయితే బెటరని ఆలోచితున్నారంట.

అయితే తొలుత శ్రీదేవి.. బాపట్ల లోక్ సభ నుంచి ఎంపీగా పోటీచేస్తారని కథనాలొచ్చాయి. అయితే... ఆమె అసెంబ్లీకే ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆమెకు తిరువూరు అకామిడేట్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

కాగా... తిరువూరు నియోజకవర్గం టీడిపీ రాకముందు కాంగ్రెస్ కంచుకోట కాగా... ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అది సైకిల్ కు అనుకూలంగా మారింది. అయితే వైఎస్సార్ ఎంటరయ్యాక అది పూర్తిగా వైఎస్ ఫ్యామిలీ కి పెట్టని కోటలా మారింది. 1983, 1985ల్లో టీడీపీ ఇక్కడ వరుసగా గెలిచింది. 1989లో కోనేరు రంగారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగా... ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లోనూ టీడీపీనే గెలిచింది.

ఇక వైఎస్సార్ టైంలో 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ తిరిగి కాంగ్రెస్ గెలవాగా... 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ నేత, మాజీమంత్రి కేఎస్ జవహార్ పోటీచేసి ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవిని పోటీలో నిలపాలని భావిస్తున్నారంట.

కాగా ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి కె.రక్షణ నిధి వరుసగా రెండు సార్లు గెలిచిన సంగతి తెలిసిందే. 2014 లో 1,676 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన... 2019లో 10,835 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.