Begin typing your search above and press return to search.

బాబాయ్ అబ్బాయ్... ఇద్దరికీ మంత్రి పదవులు...!?

ఇంత జరిగినా జగన్ వేవ్ బలంగా వీచినా కింజరాపు కుటుంబం మాత్రం సక్సెస్ ట్రాక్ తప్పలేదు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 3:30 AM GMT
బాబాయ్ అబ్బాయ్... ఇద్దరికీ మంత్రి పదవులు...!?
X

శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కింజరాపు కుటుంబం బలమైన అండగా ఉంటోంది. ఒక మాటలో చెప్పాలంటే కాపు కాస్తోంది. నాలుగు దశాబ్దాలుగా ఆ ఫ్యామిలీ శ్రీకాకుళం టీడీపీ జెండా నీడన ఎదిగింది. పార్టీని కూడా రెపరెప లాడించింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ చతికిలపడింది. ఇంత జరిగినా జగన్ వేవ్ బలంగా వీచినా కింజరాపు కుటుంబం మాత్రం సక్సెస్ ట్రాక్ తప్పలేదు.

బాబాయ్ అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా అబ్బాయ్ రామ్మోహన్ రెండవసారి విజయం సాధించారు. ఇక ఇపుడు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పార్టీని పటిష్టం చేసే క్రమంలో బాబాయ్ అబ్బాయ్ గట్టిగానే తిరుగుతున్నారు. దీంతో వీరిద్దరు మీద టీడీపీ అధినాయకత్వం భారం వేసింది.

ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి కావాలని అబ్బాయ్ రామ్మోహన్ భావించారు. ఆయన ఈసారి ఎంపీగా చేయకూడదు అని గట్టి నిర్ణయమే తీసుకున్నారు అని ఒక దశలో ప్రచారం సాగింది. అయితే ఆయన్ని టీడీపీ అధినాయకత్వం నచ్చచెప్పి పోటీలో ఉంచుతోంది. యువకుడు డైనమిక్ లీడర్ అయిన రామ్మోహన్ పోటీలో ఉంటే ఆ లోక్ సభ పరిధిలో సీట్లు కూడా పెరుగుతాయన్నది టీడీపీ ఆలోచన. దాంతో పాటుగా ఈసారి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవిని కూడా ఇప్పిస్తామని టీడీపీ హై కమాండ్ ఆయనకు హామీ ఇచ్చిందని అంటున్నారు.

బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 2024 తరువాత కేంద్రంలో ఏర్పడే మోడీ ప్రభుత్వంలో చేరుతుంది అని అంటున్నారు. అపుడు ఉత్తరాంధ్రా కోటాలో బీసీ కోటాలో రామ్మోహన్ కి తప్పకుండా చాన్స్ వస్తుందని అంటున్నారు. రామ్మోహన్ కి ఆ హామీ ఇవ్వడంతో ఆయన రెట్టించిన్ ఉత్సాహంతో ఈసారి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు అని అంటున్నారు.

తన పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీకి గెలిపించి చూపిస్తామని రామ్మోహన్ అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడుకి కూడా రాష్ట్ర క్యాబినేట్ లో మంత్రి పదవి ఖాయం అని అంటున్నారు. ఇటీవల శంఖారావం సభకు వచ్చిన లోకేష్ మాట్లాడుతూ కాబోయే హోం మంత్రిగా అచ్చెన్నాయుడు గురించి చెప్పారు. అచ్చెన్న వంటి పవర్ ఫుల్ లీడర్ హోం మంత్రి అయితేనే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుందని కూడా ఆయన చెప్పడం విశేషం. మొత్తానికి కింజరాపు ఫ్యామిలీ దశ 2024 ఎన్నికల తరువాత మారుతుందని అంతా అంటున్నారు.