Begin typing your search above and press return to search.

మేం తటస్థం.. 'బాబు'పై ఎట్టకేలకు నోరిప్పిన కేటీఆర్

వాళ్ల పార్టీ నాయకులు.. ఎమ్మెల్యేలు మాట్లాడారు.. ఎంపీలు మాట్లాడారు.. మంత్రులూ మాట్లాడారు.. కానీ, ఆ పార్టీలో పుట్టిపెరిగిన మరో పార్టీ అధినేత కానీ.. ఆయన కుమారుడు కానీ స్పందించలేదు

By:  Tupaki Desk   |   26 Sep 2023 11:51 AM GMT
మేం తటస్థం.. బాబుపై ఎట్టకేలకు నోరిప్పిన కేటీఆర్
X

వాళ్ల పార్టీ నాయకులు.. ఎమ్మెల్యేలు మాట్లాడారు.. ఎంపీలు మాట్లాడారు.. మంత్రులూ మాట్లాడారు.. కానీ, ఆ పార్టీలో పుట్టిపెరిగిన మరో పార్టీ అధినేత కానీ.. ఆయన కుమారుడు కానీ స్పందించలేదు. ఘటన జరిగిన తొలి రోజు నర్మగర్భంగా స్పందించి ఊరుకోవడం తప్ప.. దాదాపు 18 రోజులుగా మౌనం దాల్చారు. దీనికి రాజకీయ విభేదాలు కారణం అనుకున్నా.. మరీ ఇంతగానా? అనే సందేహమూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఆ పార్టీ అధినేత కుమారుడు స్పందించారు. తమ ఉద్దేశం ఏమిటో చెప్పారు.

ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి. ఆయనపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి, జైలులో పెట్టిందని జాతీయ స్థాయి నేతల నుంచి తెలంగాణలోని అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వరకు అందరూ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనల్లోనూ పాల్గొన్నారు. కానీ, టీడీపీలో పుట్టి.. ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయి.. రాజకీయంగా ఎదిగిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరు మెదపలేదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారే చంద్రబాబుకు మద్దతుగా నిలవగా, కేసీఆర్ తన ఒకప్పటి సహచరుడి అరెస్టు గురించి మాట్లాడకపోవడం ఏమిటనే ప్రశ్నలు వచ్చాయి.

కేసీఆర్ కాకున్నా.. కేటీఆర్ అయినా..

కేసీఆర్ అంటే.. రాజకీయ విభేదాలతో చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదని అనుకుందాం. కానీ, ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కు ఏమైంది? అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.

గత ఎన్నికల విభేదాలతోనేనా?

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ వ్యవహరించింది. కాంగ్రెస్-కమ్యూనిస్టులతో జట్టుకట్టింది. దీంతో కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహం కలిగింది. అప్పటినుంచి టీడీపీని, చంద్రబాబును శత్రువుగా పరిగణించడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అడ్డుకట్ట వేయడంలో కేసీఆర్ కీలకంగా వ్యవహరించారనే అరోపణలు వచ్చాయి. అయితే, చంద్రబాబు అరెస్టయిన దాదాపు 15 రోజులకు కేటీఆర్ స్పందించారు. అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించిన అంశంగా కొట్టిపారేశారు. తనదైన శైలిలో స్పందిస్తూ. ''అది ఆంధ్రా పంచాయితీ. అక్కడే తేల్చుకోవాలి'' అని కూడా అన్నారు.

ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారుగా?

కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ.. ఆంధ్ర పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని అన్నారు. ఇక్కడి ప్రజలను టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అయితే, తమ పార్టీ నేతలు స్పందిస్తుండడానిన వారి వ్యక్తిగత వ్యవహారంగా పేర్కొన్నారు. 'చంద్రబాబు అరెస్టు ఏపీలో పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక్కడి ప్రజలు, రాష్ట్రంపై ప్రభావం చూపించే అంశం కాదు. ఇతర రాష్ట్రాల రాజకీయ వివాదాలతో మాకు సంబంధం లేదు. చంద్రబాబు అరెస్టు జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ర్యాలీలు, ధర్నాలు అక్కడే చేయాలి. తెలంగాణలో రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే ఎలా.'' అని ప్రశ్నించారు

చంద్రబాబు న్యాయం పోరాటం చేస్తున్నారు..

ఏపీలో ఉన్న సమస్యపై హైదరాబాద్‌లో కొట్లాడతా అంటే ఎలా? ఇది సరైంది కాదు. ఇక్కడ మేం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య వస్తే ఎలా? ఇలాంటి వాటికి ఇక్కడ ఎలా అనుమతిస్తాం. వాళ్ల ఘర్షణలకు హైదరాబాద్ వేదిక ఎలా అవుతుంది. ఆ రెండు పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదు.. స్థానం లేదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలసి ఉన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మేం తటస్థంగా ఉన్నాం. ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. బాబుకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుంది'' అని కేటీఆర్‌ వివరించారు.

లోకేశ్‌ .. జగన్‌.. పవన్‌ కల్యాణ్‌ తనకు మంచి స్నేహితులుగా అభివర్ణించారు..