అమెరికా యుద్ధం చేస్తే డాలర్ స్ట్రాంగ్ అయ్యి రూపాయి పడిపోవడం ఏంటి?
అంతర్జాతీయ రాజకీయ యవనికపై యుద్ధ తంత్రం రగులుతుంటే.. దాని సెగ భారత సామాన్యుడి జేబుకు తగులుతోంది.
By: Tupaki Desk | 4 March 2026 10:52 AM ISTఅంతర్జాతీయ రాజకీయ యవనికపై యుద్ధ తంత్రం రగులుతుంటే.. దాని సెగ భారత సామాన్యుడి జేబుకు తగులుతోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా.. దాని ప్రభావంతో భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 92.15 వద్దకు పడిపోవడం దేశ ఆర్థిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
యుద్ధ క్షేత్రంలో 'అమెరికా ఎపిక్ ఫ్యూరీ'.. మార్కెట్లో గుబులు
అమెరికా తన సైనిక చర్యలకు “ఎపిక్ ఫ్యూరీ” అని నామకరణం చేసి గల్ఫ్ ప్రాంతంలో భీకర దాడులకు దిగడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన డ్రోన్లు, మిస్సైళ్లతో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు. సాధారణంగా యుద్ధ సమయాల్లో పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన మార్గాల్లోకి మళ్లిస్తారు. ఈ క్రమంలో అమెరికన్ డాలర్ అత్యంత సురక్షితమైన ‘సేఫ్ హేవన్’ కరెన్సీగా అవతరించింది. ఫలితంగా డాలర్‌కు డిమాండ్ పెరిగి అది బలపడుతుండగా రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు కుప్పకూలుతున్నాయి.
ఒక్కరోజులోనే భారీ పతనం
మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి బలహీనత స్పష్టంగా కనిపించింది. క్రితం సెషన్‌లో 91.47 వద్ద ముగిసిన రూపాయి.. ఉదయాన్నే 55 పైసలు కోల్పోయి 92.03 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. అస్థిరత కొనసాగడంతో ఒక దశలో ఇది 92.15 స్థాయిని తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ ఏకంగా 7 శాతం పైగా క్షీణించడం గమనార్హం. ఏడాది మొదట్లో 87 రూపాయల వద్ద ఉన్న విలువ, ఇప్పుడు 100 రూపాయల వైపు పరుగులు తీస్తుండటం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది.
రూపాయిని దెబ్బతీస్తున్న ప్రధానాంశాలు
భారత్ తన అవసరాల కోసం 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిని ముడి చమురు ధరలు పెరిగితే భారత్ ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి వస్తుంది. ఇది విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచి రూపాయిని బలహీనపరుస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితి వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. రూపాయి పతనమైతే విదేశాల నుంచి మనం కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్రాలు, ముడి పదార్థాల ధరలు పెరుగుతాయి. ఇది అంతిమంగా దేశీయంగా ద్రవ్యోల్బణానికి ధరల పెరుగుదల దారితీస్తుంది. యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా, కరెన్సీ విలువ తగ్గడం వల్ల సామాన్యుడిపై ధరల భారం పడుతుంది. రూపాయి 100 మార్కును చేరకుండా చూడాలంటే రిజర్వ్ బ్యాంక్ తక్షణమే జోక్యం చేసుకోవాలి అని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు.
మున్ముందు పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం రూపాయి పతనం ఇలాగే కొనసాగితే అది 100 మార్కును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రూపాయిని కాపాడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం దిగుమతులను తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలి.
మొత్తానికి మధ్యప్రాచ్యంలో పేలుతున్న బాంబులు.. అమెరికా ప్రదర్శిస్తున్న యుద్ధ కాంక్ష భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి దెబ్బే కొడుతున్నాయి. ఈ అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో రూపాయి విలువ నిలదొక్కుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనడం ఒక్కటే తక్షణ పరిష్కారంగా కనిపిస్తోంది.
