కూతురు విడాకుల మంజూరును వేడుక చేసిన రిటైర్డ్ జడ్జి
తన కూతురికి కోర్టు విడాకులు మంజూరు చేసిన వేళ.. దాన్నో వేడుకగా నిర్వహించిన ఒక తండ్రి ఉదంతం ఆసక్తికరంగా మారింది.
By: Garuda Media | 6 April 2026 12:56 PM ISTకాలం మారింది. అందుకు తగ్గట్లే జీవనశైలి మారుతోంది. సంప్రదాయాలు.. కట్టుబాట్లు లాంటివి మనకు మనం పెట్టుకున్నవే అన్న విషయాన్ని కొందరు గుర్తిస్తే.. మరికొందరు మాత్రం వాటిల్లోనే బంధీలుగా మారి.. తమ పిల్లల్ని సైతం ఆ అంధకారంలోనే ఉంచేస్తారు. అందుకు భిన్నంగా పిల్లల ఆనందమే తమ ఆనందంగా జీవించే తల్లిదండ్రులు కొందరు ఉంటారు. వారు తీసుకునే నిర్ణయాల్ని గౌరవిస్తూ.. సందర్భం ఏదైనా సరే వారికి అండగా నిలిచే తీరును ప్రదర్శిస్తుంటారు. ఆ కోవలోకే వస్తుంది ఈ ఉదంతం.
తన కూతురికి కోర్టు విడాకులు మంజూరు చేసిన వేళ.. దాన్నో వేడుకగా నిర్వహించిన ఒక తండ్రి ఉదంతం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఆ తండ్రి మాజీ జడ్జి కావటం ఈ ఉదంతంలో మరో ట్విస్టుగా చెప్పాలి. తన కూతురు ఆనందం కంటే తనకేమీ ముఖ్యం కాదనే ఆయన మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకూ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుంది? దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ కు చెందిన రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర కుమార్ శర్మ రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు.
సైకాలజీలో పీజీ చేసిన శర్మ కుమార్తె ప్రణీత వశిష్ఠకు 2018లో ఆర్మీ మేజర్ తో పెళ్లైంది. అయితే.. వారి వైవాహిక జీవితం సరిగా సాగలేదు. దంపతుల మధ్య వివాదాల నేపథ్యంలో మేరఠ్ లోని కుటుంబ న్యాయస్థానం ఆమెకు విడాకులు మంజూరు చేసింది. ప్రణీత కోర్టు నుంచి బయటకు రాగానే.. కుటుంబ సభ్యులు ఆమె మెడలో పూలమాలలు వేసి.. మేళతాళాలతో పుట్టింటికి తీసుకొని వెళ్లారు.
వీరంతా కోర్టు ప్రాంగణంలో ‘ఐ లవ్ మై డాటర్’ అంటూ ప్రణీత ఫోటోలు ఉన్న టీ షర్టులను ధరించటం గమనార్హం. వైవాహిక జీవితంలో తన కుమార్తె సంతోషంగా లేదని.. అలాంటప్పుడు ఆ వాతావరణం నుంచి బయటకు తీసుకురావాల్సింది తానేనని.. తన విధిగా ఆయన చెబుతున్నారు. కుమార్తెలు ఆస్తులు కాదన్న ఆయన.. తమకు ఎలాంటి భరణాలు అక్కర్లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. పిల్లల సంతోషం కోసం తండ్రులు ఎంతకైనా ముందుకు వెళ్లే తీరుకు ఈ ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.
