Begin typing your search above and press return to search.

మావిగన్ జగన్ కాదట...వెనక ఆ పార్టీ ఉందట !

అయితే మావిగన్ అన్నది జగన్ సొంత ఆలోచన కాదని దాని వెనక ఒక బడా పార్టీ ఉందని కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

By:  Satya P   |   18 July 2026 6:30 PM IST
మావిగన్ జగన్ కాదట...వెనక ఆ పార్టీ ఉందట !
X

మావిగన్ అని కొత్త సూత్రీకరణ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అయితే మావిగన్ అన్నది జగన్ సొంత ఆలోచన కాదని దాని వెనక ఒక బడా పార్టీ ఉందని కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదాను లేకుండా చేయడానికి ఏపీ శాశ్వతంగా అడగకుండా చూడడానికే మావిగన్ పేరుతో కొత్త నాటకం అని ఆయన అంటున్నారు.

రాజధాని విషయంలోనూ :

ఇదిలా ఉంటే ఏపీ రాజధాని విషయంలో అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరూ రాజకీయ నాటకం ఆడుతున్నారని హర్షకుమార్ విమర్శించారు. ఏపీకి సంజీవిని లాంటి ప్రత్యేక హోదాను ఈ రెండు ప్రాంతీయ పార్టీలు పూర్తిగా పక్కన పెట్టేశాయని, పైగా బీజేపీ డైరెక్షన్ లో నడుస్తూ రాజధాని విషయంలో వారు చెప్పినట్లే వ్యవహరిస్తున్నాయని ఆయన అంటున్నారు. మావిగన్ పేరుతో కేవలం విజయవాడ మచిలీపట్నం, గుంటూరులను అభివృద్ధి చేస్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే టీడీపీ కూడా అమరావతిలోనే ఈ ప్రాంతాలు ఉన్నాయని చెబుతోంది అని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా అభివృద్ధి కేంద్రీకరణ వల్ల ఏపీకి ఏమి ఒరుగుతుందని ఆయన నిలదీశారు.

బీజేపీ తెర వెనక :

ప్రత్యేక హోదా డిమాండ్ ని పూర్తిగా లేకుండా చేయడానికి బీజేపీ తెర వెనక ఉంటూ మావిగన్ వంటి ప్రతిపాదనలు చేయిస్తోంది అని ఆయన మండిపడ్డారు. ఇది బీజేపీ రూపొందించిన అలాగే ప్రాంతీయ నాయకుల ద్వారా అమలు చేయబడిన ఒక మోసపూరిత ప్రణాళికగా హర్షకుమార్ అభివర్ణించారు. ఏపీకి బీజేపీ ద్రోహం చేసింది అని ఆయన అన్నారు. ఏపీ ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా ప్రత్యేక హోదా వంటి వాటితో ముడిపడి ఉన్నాయని ఆయన అంటున్నారు. అయితే వాటి నుంచి తప్పించేందుకు రాజకీయ పెయిన్ కిల్లర్ లాంటి ఒక ఫార్ములాయే మావిగన్ ఫార్ములా అని హర్ష కుమార్ అభివర్ణించారు.

చిన్న ప్రాంతానికే అభివృద్ధి :

కేంద్ర బీజేపీ నాయకత్వం ఆదేశాల మేరకే ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన పనిచేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని అభివృద్ధిని అంతా ఒక చిన్న కేంద్ర ప్రాంతానికే పరిమితం చేయాలన్నదే ఈ ఎత్తుగడ అని హర్ష కుమార్ వివరించారు. ప్రధాన పార్టీలు అన్నీ ప్రత్యేక హోదా కోసం పోరాడటానికి బదులుగా ఇలాంటి ప్రతిపాదనలు చేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే దాని ద్వారా అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అలాంటి హోదాకు పోరాడే బదులు ప్రజల డిమాండ్లను అణచివేసేందుకు ప్రాంతీయ పార్టీలు మావిగన్ ఫార్ములాను ఒక తాత్కాలిక పరిష్కారంగా చూపిస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు.

దానికి సాటి రాదు :

ఇక ప్రత్యేక హోదా అంటే ఏపీ సర్వతోముఖాభివృద్ధి అని హర్షకుమార్ అన్నారు. పూర్తి స్థాయి ప్రత్యేక హోదాతో లభించే ఆర్థిక ప్యాకేజీలు, పారిశ్రామిక రాయితీలు పన్ను మినహాయింపులతో ఏపీ అన్ని విధాలుగా బాగుపడుతుందని అన్నారు. అయితే దానికి బదులుగా కేవలం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఏపీకి ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని మాజీ అమలాపురం ఎంపీ వాదిస్తున్నారు. ఇలాగైతే వెనకబడిన ఉత్తరాంధ్రా, రాయలసీమ వంటి ప్రాంతాల సంగతి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను పూర్తిగా నీరు గార్చడానికి ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా కేంద్రంపై ఆధారపడేలా చేయడానికి ప్రాంతీయ పార్టీలను వాడుకుంటోందని హర్ష కుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలకడగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేస్తున్నారు.